వంద రోజులు ‘ఉపాధి’ పని పూర్తి చేసిన వారికి చాన్స్
జిల్లాలో 111 మందికి ట్రైనింగ్ ఇచ్చే చాన్స్
ఇప్పటివరకు 40 మంది ఎంపిక
అర్హుల కోసం కొనసాగుతున్న సర్వే
స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యం
మొత్తం 1,16,987 జాబ్‌కార్డులు
భూపాలపల్లి టౌన్, జనవరి 1 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం కూలీల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. వారికి స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఉన్నతి పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద వంద రోజులు పని పూర్తి చేసిన, 35 ఏళ్లలోపు కూలీలను ఎంపిక చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన సర్వే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతోంది. ఎంపికైన వారి విద్యార్హత ప్రకారం సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్, టైపింగ్, భవన నిర్మాణం, కరెంట్ వైరింగ్, మేస్త్రీ, వెల్డింగ్ వంటి వాటిపై ట్రైనింగ్ ఇస్తారు. రెండు వారాల నుంచి మూడు నెలల ట్రైనింగ్ తర్వాత ఇచ్చే సర్టిఫికెట్తో ఎక్కడైనా పనిచేసుకోవచ్చు. జిల్లాలో 111 మందికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. ఇప్పటివరకు 40 మందిని ఎంపిక చేశారు. ఇంకా జాబ్ రిసోర్స్ పర్సన్స్ సర్వే కొనసాగిస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,16,987 జాబ్‌కార్డులు ఉండగా, ఈ ఏడాది ఇప్పటివరకు 5,423 కుటుంబాలు వంద రోజులు పని పూర్తి చేసుకున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పల్లెల్లోని కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పిస్తుండగా, మరోవైపు యువతకు నైపుణ్య శిక్షణకు రంగం సిద్ధమవుతోంది. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరిగిపోతోంది. దీంతో పనులు తగ్గి ఉపాధి హామీ పథకం ద్వారా వంద రోజుల పని కల్పిస్తున్నారు. ఇదే పథకంలో శిక్షణ ఇచ్చి వారికి శాశ్వత ఉపాధి చూపించేందుకు ప్రభుత్వం ‘ఉన్నతి’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. వంద రోజులు పని పూర్తిచేసుకున్న 35ఏళ్ల లోపు వారిలో విద్యావంతులను ఎంపికచేసి పలు కోర్సుల్లో శిక్షణ ఇప్పించనున్నారు. ఈమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాల్లో జాబ్ రిసోర్స్ పర్సన్స్ సర్వే చేస్తున్నారు. జిల్లాలో 111 మందికి శిక్షణ ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పటివరకు సర్వే చేసి 40 మందిని ఎంపిక చేశారు. సర్వే ఇంకా కొనసాగుతోంది. జిల్లాలో 1,16,987 జాబ్‌కార్డులు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 5,423 కుటుంబాలు వంద రోజులు పని పూర్తి చేసుకున్నారు.
‘ఉన్నతి’తో శాశ్వత ఉపాధి
గ్రామాల్లో వలసలు తగ్గించేందుకు ఉపాధిహామీ పథకంలో కూలి పని కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ప్రతి గ్రామంలో రోజూ వందలాది మంది ఈ పథకంలో చేపడుతున్న వివిధ పనుల్లో భాగస్వాములు అవుతున్నారు. 2022-23 సంవత్సరానికి గాను ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉపాధి హామీలో వంద రోజులు పని పూర్తి చేసుకున్న కుటుంబాలను గుర్తించేందుకు అధికారులు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఆయా కుటుంబాల్లోని యువత స్వయం ఉపాధి పొందేలా ఎంచుకున్న రంగంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. పది, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారికి స్కిల్డ్ విభాగం, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ నైపుణ్యం, కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్, టైపింగ్, బేసిక్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్, భవన నిర్మాణం, కరెంట్ వైరింగ్, మేస్త్రీ, వెల్డింగ్ వంటి వాటిపై శిక్షణ ఇచ్చి ఆయా రంగాల్లో ఉపాధి కల్పించనున్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్హతగా నిర్ణయించారు. మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వనున్నారు. 15 రోజుల నుంచి మూడు నెలల పాటు కోర్సులు కొనసాగుతాయి. కోర్సు పూర్తయిన తర్వాత ఇచ్చే సర్టిఫికెట్తో ఎక్కడైనా ఉపాధి పొందవచ్చు.
జిల్లాలో 1,16,987 జాబ్‌కార్డులు
జిల్లాలో 1,16,987 జాబ్‌కార్డులు ఉన్నాయి. భూపాలపల్లి మండలంలో 11,403, చిట్యాల 12,271, గణపురం 14,169, కాటారం 10,378, మహాదేవ్‌పూర్ 10,177, మల్హర్ 8,557, మొగుళ్లపల్లి 9,678, మహాముత్తారం 8,345, పలిమెల 2,880, రేగొండ 20270, టేకుమట్లలో 8,861 జాబ్‌కార్డులు ఉన్నాయి. రేగొండ మండలంలో అత్యధిక సంఖ్యలో జాబ్‌కార్డులు కలిగి ఉన్నారు.
5,423 కుటుంబాలు.. వంద రోజులు
జిల్లాలో ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది ఇప్పటివరకు 5,423 కుటుంబాలు వంద రోజులు కూలీ పని పూర్తి చేసుకున్నాయి. భూపాలపల్లి మండలంలో 623, చిట్యాల 494, గణపురం 365, కాటారం 711, మహాదేవ్‌పూర్ 454, మల్హర్ 732, మొగుళ్లపల్లి 191, మహాముత్తారం 990, పలిమెల 128, రేగొండ 412, టేకుమట్లలో 323 కుటుంబాలు ఉన్నాయి.
సర్వే కొనసాగుతోంది..
ఉన్నతి పథకంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సర్వే చేస్తున్నాం. ఉపాధిహామీలో వంద రోజులు కూలీ పని పూర్తిచేసుకున్న వారిని గుర్తించి విద్యార్హతల ఆధారంగా వారికి ఇష్టమైన కోర్సుల్లో శిక్షణకు ఎంపిక చేస్తాం. జిల్లాలో 111 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఆదేశాలు వచ్చాయి. ఇప్పటివరకు 40 మందిని ఎంపిక చేశాం. ఇంకా సర్వే కొనసాగుతోంది. జాబ్ రిసోర్స్ పర్సన్స్ ఇద్దరే ఉండడంతో సర్వేలో కొంత జాప్యమవుతోంది. సర్వే పూర్తి చేశాక శిక్షణను ప్రారంభిస్తాం. 2022-23 సంవత్సరానికి గాను పనుల గుర్తింపు ప్రక్రియ సైతం కొనసాగుతోంది.-పురుషోత్తం, డీఆర్డీఓ