టీచర్ల బదిలీల జీవో 317పై తొండి రాజకీయం
ఉపాధ్యాయ, ఉద్యోగులకు మద్దతు పేరిట కొత్త నాటకం
కరీంనగర్ కేంద్రంగా జాగరణ పేరుతో రణరంగం సృష్టించే ప్రయత్నం
సర్కారును బదనాం చేసేందుకు ఎప్పుడూ ఏదో ఒక కుట్ర
రాజకీయ జోక్యం అవసరం లేదు : ఉపాధ్యాయ సంఘాలు
దీక్ష పేరుతో ఎందుకీ డ్రామాలు
ములుగు/భూపాలపల్లి, జనవరి 2(నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయులకు తానేదో చేస్తానన్నట్టు దీక్ష పేరుతో డ్రామాలు చేస్తున్న బండి సంజయ్‌పై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. సర్కారును బదనాం చేసేందుకు ఎప్పుడూ ఏదో ఒక కుట్ర చేస్తూ వస్తున్న తొండి నేత.. ఆదివారం రాత్రి కరీంనగర్లో జాగరణ దీక్ష పేరిట మరో నాటకానికి తెరతీసి భంగపడ్డాడు. చిన్న చిన్న సమస్యలను బూచిగా చూపిస్తూ ప్రభుత్వంపై బురదజల్లడం తగదని, ఇందులో రాజకీయ జోక్యం ఎందుకని ఆయా యూనియన్ల నేతలు ప్రశ్నిస్తున్నారు. సమస్యలుంటే పరిష్కరించుకునే సత్తా ఉందని, తమకోసం జాగరణ చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం అవలంబిస్తున్న విధానంతో 85శాతం మందికి న్యాయం జరిగిందని, ఇంకేమైనా ఇబ్బందులుంటే సంఘాల నేతలతో చర్చించి సానుకూలంగా పరిష్కరించుకోవాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ప్రతిపక్షాల మాయలో పడి ఆగం కావద్దని, ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
బండి సంజయ్ మరోసారి కొత్త డ్రామాకు తెరలేపారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో వివిధ వర్గాలను ముందు పెట్టి డ్రామాలు చేయగా ఈసారి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను తన చట్రంలోకి లాగేందుకు ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయుల జిల్లాల కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన 317 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లోని తన ఎంపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపడుతున్నట్లుగా 24 గంటల ముందే ప్రకటించారు. ఆమేరకు పార్టీ శ్రేణులు కదిలిరావాలని పిలుపు నిచ్చారు. నిజానికి ప్రస్తుతం కొవిడ్ పెరుగుతోంది. ఒమిక్రాన్ విజృంభిస్తున్నందున ఎక్కువ మంది గుమిగూడటం, ధర్నాలు, ర్యాలీల వంటివి ముందస్తు అనుమతి లేకుండా చేయరాదని కేంద్రం అన్ని రాష్ర్టాలకు హెచ్చరికలు జారీచేసింది. కానీ ఇవేవీ పట్టనట్లుగా బండి వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల సమస్యను పరిష్కరించాలని భావిస్తే ఒక ప్రతి పక్షపార్టీ అధ్యక్షుడిగా ముందుగా సదరు సమస్యను ప్రభుత్వం దృష్టికి స్వయంగా తీసుకెళ్లాలి. లేదా లేఖ రాయాలి. అప్పటికీ స్పందించకపోతే.. ఏవైనా కార్యక్రమాలు చేపట్టాలి. కానీ అవేమీ లేకుండానే జాగరణ పేరిట రాత్రంతా రణరంగం చేసేందుకు ఆయ కుట్రపన్నారన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు జాగరణ చేస్తున్నట్లుగా ముందస్తుగానే ప్రకటించినప్పుడు ఆమేరకు పోలీసుల అనుమతి ఎందుకు తీసుకోలేదన్నదానిపై ఆయన వద్ద సమాధానం లేదు. అంతేకాదు ఈ సమస్య రాష్ట్రస్థాయిది అయినప్పుడు.. కరీంనగర్లో జాగరణ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఇక్కడ శ్రేణులను రెచ్చగొట్టి సానుభూతి పొందాలన్న ప్రయత్నమే ఇందులో అధికంగా కనిపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్వరాష్ట్రంలోనే టీచర్లకు న్యాయం
బండి సంజయ్ చేస్తున్న దీక్షతో ఉద్యోగులకు ఒరిగేదేం లేదు. సమస్య ఏదైనా ఉపాధ్యాయులందరికీ న్యాయం జరిగేలా ఉండాలి. ఉద్యోగుల విభజన ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 317 జీవోతో ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయి. ఈ జీవో ద్వారానే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు పదోన్నతులతో పాటు కొత్తగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. విపక్షాలు, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు పనిగట్టుకొని రాద్ధాంతం చేయడం మానుకోవాలి. జీవో రద్దయితే కొత్త రిక్రూట్మెంట్లు ఆగిపోతాయి. బదిలీలు, ఖాళీలు సరి చేయాలంటే ఈ విధానం కొనసాగాల్సిందే.
హక్కులను కాపాడేది సంఘాలే..
ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కులను కాపాడేందుకు సంఘాలు ఉన్నాయి. ఇందులో రాజకీయ ప్రమేయం సమంజసం కాదు. రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన మూడు సంవత్సరాల తర్వాత రాజకీయ అంశంగా చూడకుండా 317 జీవో అమలులో ఏర్పడ్డ అవరోధాలను అధిగమించి సీనియార్టీ జాబితాలో ఏర్పడిన లోపాలను సవరిస్తే తగిన న్యాయం జరుగుతుంది. కానీ రాజకీయాలు చేస్తే సమస్య మరింత జఠిలం అవుతుంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల అప్పీళ్లను పరిష్కరించిన తర్వాతే పోస్ట్ అలాట్మెంట్ చేయాలి. భవిష్యత్తులో ఏర్పడే ఖాళీల్లో స్థానిక ఉద్యోగ, ఉపాధ్యాయులకు అవకాశం కల్పించి వారు స్వస్థలాలకు వెళ్లేలా వెసులుబాటు కల్పించాలి.