మహాదేవపూర్, మే 29: మహాదేవపూర్ మండల పరిధిలోని అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బారేజ్ (Lakshmi Barrage) వద్ద సెక్యూరిటీ గార్డ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్ర చెందిన ఓ వ్యక్తి తన వాహనంలో మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వచ్చి గేటు తెరవాలని సెక్యూరిటీ గార్డ్ రవీందర్‌ను అడిగారు. గేటు తెరిచేందుకు సెక్యూరిటీ గార్డు ససేమిర అనడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన వారు.. బండలతో అతనిపై దాడికి పాల్పడ్డారు.
తీవ్రంగా గాయపడిన రవీందర్‌ను తోటి సిబ్బంది వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటన మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.