ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
ములుగు రూరల్, డిసెంబర్ 29 : ‘రైతుబంధు’వొచ్చి పెట్టుబడి సాయం తేవడంతో రైతన్నల్లో సంబురం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులుగా రైతు ఖాతాల్లో నగదు జమ చేస్తుండగా మొదటిరోజు ఎకరం విస్తీర్ణం, బుధవారం రెండో రోజు మరికొందరికి అందించింది. దీంతో పెట్టుబడి సొమ్ము తీసుకున్న రైతులు.. వ్యవసాయం పనుల్లో అదునుకు ఆసరా అవుతున్నాయని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఒకప్పుడు కరెంట్ సరిగా లేక, ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు కొనేందుకు సమయానికి చేతిల డబ్బుల్లేక అనేక ఇబ్బందులు పడ్డామని.. కేసీఆర్ రైతుబంధు తెచ్చిన తర్వాత ఆ బాధలన్నీ తీరాయని ధీమా వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవుసాన్ని పండుగలా చేశాడని, ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ముందుకుసాగుతామని హర్షిస్తూ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
చెయ్యిసాపకుంట పనైతాంది..
కేంద్రం వడ్లు కొనుడు బంద్ అనుడుతోటి ఒకటే రంది వట్టుకున్నది. మరి ఈ తాప రైతుబంధు పైసలు పడ్తయో లేదోనని గుటగుట ఉండె. ఇంతల్నే ‘ఏదేమైనా.. రైతుబంధు ఇచ్చుడే’ అని సీఎం కేసీఆర్ సారు చెప్పిన మాట గుర్తుకచ్చింది. గిట్ల అనుకున్ననో లేదో నిన్న బ్యాంకుల పైసల్ పడనే పడ్డయ్. ఒక్కసారి మళ్ల పానం అచ్చినట్టయ్యింది. నాకు ఎకురన్నర పొలం ఉంది. వానకాలం వచ్చిన రైతుబంధు పైసలు తియ్యలె, అక్కరకు అత్తయని అట్లనె ఉంచిన. ఇప్పుడు పడ్డ పైసలు, అప్పటి పైసలు రేపన్న, ఎల్లుండన్న బేంకుకు పోయి ఇడిపిత్త. పైసలు పంట యేసేటప్పుడు శాన అవసరం అయితయ్. రూపాయి కోసం ఎవరి కాడికి పోయి చెయ్యి చాపకుండా అయితాంది. ఇప్పుడు కూడా పొలం కాడికి పోయి చూసి అత్తాన. ఎడ్లకు మేత కోసం గడ్డి తీసుకొని వస్తున్న. అందరు అడుగుతాన్రు.. నువ్వు ఏ పంట ఎత్తవని. తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం అచ్చేదే సాగుచేద్దామని అనుకుంటాన.-బోయిని చంద్రయ, ములుగు
నాకు, నా పిల్లలకు సాయమైతాండు..
జనగామ రూరల్, డిసెంబర్ 29 : నాకు మూడు ఎకరాల దాక వ్యవసాయ భూమి ఉంది. సీఎం కేసీఆర్ రైతుబంధు పెట్టినప్పటి నుంచి నాకు రూ.15వేలు పడుతున్నయ్. పంట పెట్టుబడికి ఎంతో ఆసరా అయితానయ్. ఇంట్ల ఏమన్న అత్యవసరమైతే పనికత్తానయ్. నాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద బిడ్డ పెళ్లి చేసిన. ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి పథకం డబ్బులు వచ్చినయ్. అంతేకాదు సర్కారు దవాఖాన్లనే ప్రసవమైంది. కేసీఆర్ కిట్ కూడా ఇచ్చిన్రు. డబ్బులు కూడా తొందరనే వస్తయని డాక్టర్లు చెప్పిన్రు. రైతుబంధు అటు ఎవుసం పనులకు సాయమైతే.. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఇచ్చి మా పిల్లలకు సాయం చేత్తాండు కేసీఆర్ సారు. గిట్ల అన్నితీర్ల ఆదుకుంటున్న సర్కారు ఉన్నందుకు సంతోషంగా ఉంది. మునుపటి లెక్క ఎవుసం పని కోసం జమానత్ వెట్టి పైసల్ తెచ్చుకొనే రోజులు పోయినయ్. కల్లం కాన్నే పంట అమ్ముకొని ధైర్యంగా బతుకుతున్న.
రైతుబంధు లేకుంటే నాతోటి గాకపోవు..
బచ్చన్నపేట, డిసెంబర్ 29 : నా భర్త చనిపోయి పదిహేనేండ్లయింది. అప్పుడు ఇద్దరు కొడుకులు చిన్నోళ్లే. తర్వాత ఆయన పేరు మీదున్న రెండెకరాల భూమిని నా పేరుకు చేయించుకున్న. వరి పండించుకుంట కుటుంబాన్ని సాదుతాన. పెట్టుబడి పైసల కోసం కొమటోళ్లను అడిగి తీసుకచ్చేది. ఉన్న భూమిని అచ్చుకట్టి వరి పెట్టిన. వచ్చిన దాంట్ల పెట్టుబడికి పోను కొంచెం మిగిలేది. ఎవుసం చేసెటందుకు శాన గోసపడ్డ. ఇంతల సీఎం కేసీఆర్ అచ్చినంక రైతుబంధు తెచ్చుట్ల నా రందివోయింది. కారుకు రూ.10వేలు బేంకుల జమైతానయ్. అవి ఎవుసం పనులకు ఆసరైతానయ్. అప్పటి బాధలు ఇప్పుడు లేవు. అదునుకు పైసలేత్తాండు. కుటుంబం కూడా గడ్తాంది. వడ్డీ బాధలు తప్పినయ్. ఇప్పుడు పిల్లలు ఎదిగిన్రు. కేసీఆర్ సాయం చేయకపోయుంటే ప్రతీ యేడు అప్పులు ఎక్కడ తెచ్చేది. అప్పులెట్ల కట్టేది. సారు పుణ్యమా అని ఎవుసం మంచిగ సాగుతాంది. మొన్ననే మా ఊళ్లె ఉన్న మినీ బ్యాంకుల పైసల్ తెచ్చుకున్న. అక్కెరకు ఉన్నయ్ కొనాలె ఇగ.-గౌరారం సత్తెమ్మ, బండనాగారం, జనగామ జిల్లా
మస్తు అక్కరకొస్తున్నయ్
నర్సంపేట, డిసెంబర్29: రైతుబంధు పైసలు మస్తు అక్కరకొస్తున్నయ్. నాకు ఎకరం భూ ముంది. కేసీఆర్ సారు పంటకు అయిదువేలు ఇత్తున్నడు. వానాకాలం, యాసంగి పంటల సాగుకు ముందే వస్తున్నయ్. బేంకులో పైసలు పడుతున్నాయి. నా కొడుకు ఫోన్కు పైసలు పడంగనే బేంక్కు పోయి విడిపించుకుంటున్న. పోయినేడు రెండు పంటలకు ఇత్తనాలు కొన్నం. దున్నుడు కూల్లు, నాటుకు, ఎరువులకు సరిపోయినయ్. కేసీఆర్ ఇత్తున్న రొక్కంతో అప్పులకు పోవుడు తప్పింది. బయట వడ్డీలకు కూడా పోవడంలే. పంటలు చేతికి వచ్చినంక పైసలు మిగుల్తున్నయ్. వీటితో కుటుంబ ఖర్చులు తీర్చుకుంటున్నం. సీఎం సారు పైసలు పంపి మమ్మల్ని ఆదుకుంటున్రు. ఆయన చల్లం గుండాలె. యాసంగిలో పెద్దాయన చెప్పినట్లే పంటలు వేస్తానం. ఈ రోజుల్ల ఎవ్వరు పైసలు ఇస్తాన్రు. కేసీఆర్ సారు చాలా మంచోడు. పది కాలాల పాటు ఇలా డబ్బులు ఇయ్యాలె. -లావుడ్య నర్సింహ, అక్కల్చెడ
ఎవుసాన్ని పండుగం చేసిండు..
తెలంగాణ సర్కార్ అందిస్తున్న రైతుబంధుతో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. నాకు ఏటా 50వేల పంట పెట్టుబడి వస్తుంది. నాకు ఐదెకరాల భూమి ఉంది. అప్పట్ల ఓ దిక్కు అప్పుల బాధ ఉంటే.. కరెంట్ కూడా సక్కగ ఉండకపోయేది. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేది. నీళ్లు లేక పంటలు ఎండిపోయేది. తిందామంటే తిండికి ఉండకపోయేది. దిక్కు లేక పట్నం వలసపోయేది. ఇప్పుడా బాధ లేకుండా పోయింది. 24గంటల కరెంటు, గోదావరి నీళ్లతోటి చెరువులు నిండుతానయ్. వలస పోయినోళ్లు కూడా ఊళ్లకు అచ్చిన్రు. ఇవన్నీ సౌలత్లతోటి పెట్టుబడి సాయం కూడా ఇచ్చినంక వ్యవసాయాన్ని పండుగగా మార్చిండు. అందుకే కేసీఆర్కు రైతులు ఎప్పటికీ రుణపడి ఉంటారు.- జాయ బుచ్చయ్య, వనపర్తి, లింగాలఘనపురం, జనగామ జిల్లా