ఒకేచోట పోషకాహార ఉత్పత్తులు
సరసమైన ధరకే లభ్యం
అలనాటి ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం
పరోక్షంగా ఐదు వందల మందికి ఉపాధి
నేడు ట్రెండ్‌గా మారిన తాతల నాటి ఆహారపు అలవాట్లు
పర్వతగిరి, డిసెంబర్ 29: స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించేందుకు రూర్బన్ పథకంలో భాగంగా మిల్లెట్స్ తయారీ కేంద్రం మండలంలోని కొంకపాకకు మంజూరైంది. రూ. 49 లక్షల నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు చకచకా జరుగుతున్నాయి. స్వయంశక్తి అగ్రి ఫౌండేషన్ సీఈవో, మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ వీర్శెట్టి పాటిల్ ఆధ్వర్యంలో ఇక్కడ పనులు చేపట్టారు. రూ. 10 లక్షల నిధులతో మిషనరీ కోసం షెడ్ నిర్మించారు. మరో రూ. 30 లక్షలతో మిల్లెట్స్ తయారు చేసే మిషనరీ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. అదేవిధంగా పర్వతగిరిలోని ప్రభుత్వ గోదాములో పప్పు మిల్లు (దాల్ మిల్)ను రూ. 10 లక్షలతో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో మండలం చిరుధాన్యాలతో తయారు చేసిన వివిధ రకాల ఆహార ఉత్పత్తులకు కేంద్రం కానుంది. ఈ మిల్లెట్స్ ప్రాజెక్టు పనులతో ప్రత్యక్షంగా 50 మందికి, పరోక్షంగా ఐదు వందల మందికి ఉపాధి లభించనుంది. ఇక్కడ తయారైన ఉత్పత్తులను వివిధ ప్రాంతాల్లో స్టాళ్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే విక్రయించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. చిరుధాన్యాలతో ఆరోగ్యంతోపాటు అధిక ప్రయోజనాలు ఉండడంతో ఎంతో ప్రాధాన్యం సంతరించుకోనుంది.
కల్తీలేని పోషకాహారం..
మరికొద్ది రోజుల్లో ఇక్కడ కల్తీలేని, అనేక పోషక విలువలు ఉన్న అనేక రకాలైన ఆహార పదార్థాలు తయారు కానున్నాయి. గ్రామాల్లో పండిన చిరుధాన్యాలతో తయారీ కేంద్రంలో ప్రాసెసింగ్ చేసి బిస్కెట్లు, జొన్న రొట్టెలు, లడ్డూలు, స్వీట్లు, హాట్ ప్యాకెట్లు, మిల్లెట్ ప్రాసెస్లు, రవ్వలు, దోశ పిండి, ఇడ్లీ పిండి, నమ్కీన్ మురుకులు తయారు చేయనున్నారు. ఇక్కడ తయారైన ఉత్పత్తులను వివిధ ప్రాంతాలకు తరలించి మార్కెటింగ్ చేయనున్నారు. రైతుల వద్ద పప్పులు, కల్తీలేని చిరుధాన్యాలను కొనుగోలు చేసి కొంకపాకలో ఏర్పాటు చేస్తున్న మిషనరీలో మిల్లెట్స్ ఉత్పత్తులను తయారు చేసి, ప్రజలకు నాణ్యమైన పదార్థాలను తక్కువ ధరకే విక్రయించనున్నారు.
చిరుధాన్యాల సాగు.. లాభాలు బాగు
రైతులు తక్కువ నీటితో చిరుధాన్యాలను పండించుకోవచ్చు. సామలు ఎకరానికి ఐదారు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కొర్రలు ఆరేడు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అండు కొర్రలు, అరికెలు, చిరు ధాన్యాల పంటలు పండించడానికి కేవలం రెండు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో రైతులకు పెద్దగా ఖర్చు లేకుండానే మంచి దిగుబడి రావడం వల్ల అన్నివిధాలా లాభాలు గడిస్తారని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
ట్రెండ్‌గా మారిన పాత అలవాట్లు
తాతల నాటి ఆహారపు అలవాట్లు ప్రస్తుతం ట్రెండ్‌గా మారిన నేపథ్యంలో కొంకపాకలో ఏర్పాటు చేస్తున్న మిల్లెట్స్ ప్రాజెక్టుకు మంచి గిరాకీ ఏర్పడనుంది. చిరుధాన్యాలు కనిపించడమే గగనమైపోయిన ప్రస్తుత తరుణంలో చిరుధాన్యాలతో ఆహార ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేయడం వల్ల అనేక మందికి ఉపాధి లభించనుంది. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నందున చిరుధాన్యాల ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతారని పలువురు భావిస్తున్నారు.