రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి
ఇంటింటికీ తాగునీటి సరఫరా
విద్యుత్ స్తంభాల ఏర్పాటు
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
కరీమాబాద్, డిసెంబర్ 29: ఎన్నో ఏళ్లుగా మౌలిక వసతులకు ఆమడ దూరంలో ఉన్న కాలనీలు తెలంగాణ సర్కారు హయాంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. గుడిసెల్లో నివసించే పేదల కాలనీలను గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని గుడిసె కాలనీల్లో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టింది. వరంగల్ మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వీధుల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఎన్నో ఏళ్లుగా మురుగునీరు మధ్య సహవాసం చేసిన కాలనీవాసులు అభివృద్ధి చెందడంతో తూర్పు ఎమ్మెల్యే అరూరి రమేశ్, మేయర్ గుండు సుధారాణితోపాటు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వరంగల్ 43వ డివిజన్లోని కేసీఆర్కాలనీలో 2009 నుంచి దాదాపు వంద కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నాయి. మామునూరు ప్రధాన రహదారి నుంచి సమీపంలో ఉన్నా కనీస వసతులు లేక వారంతా నిత్యం ఇబ్బందులు పడుతుండే వారు. సమస్యను గుర్తించిన ప్రజాప్రతినిధులు ఇటీవల కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పక్కాగా అభివృద్ధి పనులు..
మామునూరు ప్రధాన రహదారి నుంచి కేసీఆర్ కాలనీ వరకు ఇటీవల తారు రోడ్డు వేశారు. దీంతోపాటు ప్రధాన రహదారి నుంచి కాలనీ వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వీధి దీపాలు అమర్చారు. కాలనీల్లో అంతర్గత రోడ్ల పనులు సైతం చేపట్టారు. డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేశారు. మిషన్ భగీరథ పైపులైన్లు వేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనతో కాలనీవాసులు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.