ఉపాధ్యాయుల జిల్లా కేడర్ కేటాయింపులో వారిపై ఆరోపణలు
సుదీర్ఘకాలంగా హనుమకొండ డీఈవో కార్యాలయంలో విధులు
విచారణ చేపట్టాలని నోడల్ ఆఫీసర్‌కు టీచర్ల వినతి
సుబేదారి, డిసెంబర్ 29: కొత్త జిల్లాల ఏర్పాటుతో జోన్ల వ్యవస్థను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పునర్విభజన చేపట్టింది. ఉపాధ్యాయుల జిల్లా కేడర్ కేటాయింపులో అవకతవకలకు పాల్పడి, హనుమకొండ డీఈవో కార్యాలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు మళ్లీ కౌన్సెలింగ్ బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తున్నది. అన్ని కేడర్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలు, పదోన్నతులు, రోస్టర్, ఐటీ రిటర్న్స్, ైక్లెమ్స్ ఫైల్స్ మూవ్ చేయడంలో వీరు కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి వరంగల్‌లోని హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, జనగామ జిల్లాలతోపాటు సిద్దిపేట జిల్లాలోని మద్దూరు, చేర్యాలకు ఇక్కడి నుంచే ఉపాధ్యాయుల కేటాయింపులు జరిపారు. సీనియర్లను పక్కన బెట్టి జూనియర్లకు జిల్లాల కేటాయింపుల్లో ప్రాధాన్యం కల్పించారు. వీరిలో ఒకరు మాత్రం ఏడాది కాలంగా ఇక్కడ పనిచేస్తున్నారు. మిగతా ముగ్గురు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా హనుమకొండ డీఈవో కార్యాలయాన్ని వదిలిపెట్టడం లేదు. ఇందులో ఇద్దరు ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌పై పదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడేళ్ల తర్వాత వారి సొంత కేడర్ పోస్టుల్లో వెళ్లాలి. కానీ, ఈ ఇద్దరికి ఆ నిబంధనలు అనేవి వర్తించవు. డీఈవో ఎవరు వచ్చినా ఈ ఇద్దరు ఇక్కడే పనిచేస్తుంటారు. వీరు టీచింగ్, ఉపాధ్యాయుల డాటాకు సంబంధించిన కంప్యూటర్ వర్క్‌ను పర్యవేక్షిస్తారు. పని అంతా కంప్యూటర్ ఆపరేటర్లతో చేయిస్తూ కార్యాలయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. ఇక ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో ఏళ్ల తరబడి ఉన్న ఓ ఉద్యోగి ఉపాధ్యాయుల పదోన్నతులు, రోస్టర్, బదిలీలు, ఐటీ రిటర్న్స్, ఇతర శాఖాపరమైన అంశాలను పర్యవేక్షిస్తాడు. పైసలు ఇస్తేనే ఫైల్ ముందుకు కదిలిస్తాడు. ఈయన మిగిలిన సెక్షన్లపై దృష్టిపెట్టి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు సరిగా పనిచేయరని పై అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తాడని ఆరోపణలు ఉన్నాయి. ఇతర సెక్షన్లలోని పనులు చేస్తూ మామూళ్లు తీసుకుంటాడనే విమర్శలు కోకొల్లలు.
విచారణ చేయాలని ఉపాధ్యాయులు వినతి..
హనుమకొండ డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులపై విచారణ చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని బాధిత ఉపాధ్యాయులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు నోడల్ ఆఫీసర్‌గా ఉన్న హనుమకొండ జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు. సీనియర్లను, జూనియర్లుగా మార్చి వందలాదిమంది ఉపాధ్యాయులకు అన్యాయం చేసిన ఈ నలుగురు ఉద్యోగులపై విచారణ చేయాలని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు కోరుతున్నారు. ఇంత జరిగినా కూడా వీరికే ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌లో డ్యూటీ వేయడం అనేది విమర్శలకు తావిస్తున్నది. ఇప్పటికే ఉపాధ్యాయుల కేటాయింపులు, అవకతవకలపై కలెక్టర్ రాజీవ్‌గాంధీహన్మంతు దృష్టి సారించారు. తప్పులను సరిదిద్ది బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేశారు. అయితే, డీఈవో నారాయణరెడ్డి పనితీరు, నిర్లక్ష్యంపై కలెక్టర్ విద్యాశాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. డీఈవో సెలవులో వెళ్లిన విషయం తెలిసిందే. డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న ఆ నలుగురు ఉద్యోగులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.