వనదేవతల సన్నిధికి పోటెత్తిన భక్తులు
కిక్కిరిసిన తల్లుల ప్రాంగణం
జాతరకు ముందే మొక్కులు చెల్లించుకుంటున్న ప్రజలు
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
తాడ్వాయి, డిసెంబర్ 29 : వరాలిచ్చే తల్లులు, భక్తుల కొంగుబంగారం, ఆదివాసీల ఆరాధ్య దైవాలుగా పిలుచుకునే మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. సారలమ్మ దేవత గద్దెపై కొలువుదీరే రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి బుధవారం భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి నిష్టతో తల్లుల గద్దెల వద్దకు చేరుకొని తమ కోర్కెలు తీర్చాలని వేడుకున్నారు. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాట పోతులు, కోళ్లను బలిచ్చారు. చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగు దారి లో ఉన్న చెట్ల కింద విడిది చేసి వంటలు చేసుకుని కుటుం బ, బంధుమిత్రులతో విందు భోజనాలు చేశారు.
గద్దెల వద్ద పారిశుధ్య పనులు
ఆదివాసీ గిరిజన దైవాలైన సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద పారిశుధ్య పనులు చేపట్టారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివస్తుండడంతో గద్దెల వద్ద కొబ్బరి, ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో జాతర కార్యనిర్వాహక అధికారి రాజేంద్రం ఆదేశాల మేరకు సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు.