విజయవాడ-ఇతార్సీకి రైల్వే లైన్
ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మీదుగా నిర్మాణం
975 కిలో మీటర్ల మేర ఏర్పాటు
డీఎఫ్‌సీసీఐఎల్ ఆధ్వర్యంలో 2వేల మందితో 60బృందాల సర్వే
2023 నుంచి ట్రాక్ పనులు ప్రారంభం
గోవిందరావుపేట, అక్టోబర్ 29 : ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైల్వే స్వప్నం నెరవేరబోతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇతార్సీ వరకు 975కిలో మీటర్ల మేర ట్రాక్ ఏర్పాటు చర్యలు వేగవంతమయ్యాయి. ఇప్పటిదాకా హైదరాబాద్ మీదుగా విజయవాడకు ఒక్కటే లైన్ ఉండడంతో రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం కొత్త రైల్వేలైన్‌కు శ్రీకారం చుట్టింది. ఇందుకు ములుగు జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థ డీఎఫ్‌సీసీఐఎల్ ఆధ్వర్యంలో 2వేల మందితో 60 బృందాల ద్వారా సర్వే ముమ్మరంగా జరుగుతున్నది. డీజీపీఎస్, లెవలింగ్, లైడర్ సర్వే సైతం కొనసాగుతున్నది. విజయవాడ నుంచి వయా చంద్రాపూర్ మీదుగా తెలంగాణలోని కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి, రామగుండం, మంచిర్యాల, మధ్యప్రదేశ్‌లోని నాగ్‌పూర్ మీదుగా ఇతార్సీకి రైల్వే లైన్ ఏర్పాటు కానుండగా భూపాలపల్లి, మణుగూరు, రామగుండం, మంచిర్యాలలో ఉన్న బొగ్గు గనుల ప్లాంట్లకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇతార్సీ వరకు నూతనంగా గూడ్స్ రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు ములుగు జిల్లాలో సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థ డీఎఫ్‌సీసీఐఎల్ ఆధ్వర్యంలో సుమారు 975కిలో మీటర్ల రైల్వే లైన్ ఏర్పాటుకు 2వేల మందితో 60 టీమ్‌ల ద్వారా సర్వే పనులు జరుగుతున్నాయి. డీజీపీఎస్, లెవలింగ్, లైడర్ సర్వే పనులు సైతం కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగ వ్యవస్థ పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం గూడ్స్ రైల్వే లైన్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి తెలంగా ణ ప్రాంతానికి బొగ్గు, ఎరువులు, పెట్రోల్ లాంటి నిత్యవసరాలు గూడ్స్ వాహనాల్లో సరఫరా కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే లైన్ ఒక్కటే ఉండడంతో రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నందున కేంద్ర ప్రభుత్వం ములుగు జిల్లా మీదుగా వయా భూపాలపల్లి నుంచి రామగుం డం మీదుగా ఇతార్సీకి లైన్ వేసేందుకు సిద్ధమైంది. గతంలో రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు సర్వేలు నిర్వహించినప్పటికీ అర్ధంతరంగా నిలిచిపోయాయి. మళ్లీ కొత్తగా యుద్ద ప్రాతిపతికన సర్వే పనులు జరుగుతున్నాయి. 2023 నాటికి రైల్వే లైన్ ఏర్పాటుకు సర్వే పూ ర్తయిన అనంతరం పనులు ప్రారంభం కానున్నాయి.
975 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నుంచి వయా చంద్రాపూర్ మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం, మణుగూర్, భూపాలపల్లి, మంచిర్యాల, మధ్యప్రదేశ్‌లోని నాగ్‌పూర్ మీదుగా ఇతార్సీకి రైల్వే నిర్మాణం కొనసాగనుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి, మణుగూర్, మంచిర్యాలో ఉన్న బొగ్గు గనుల ప్లాంట్లకు ఈ నిర్మాణం ఎంత గానో ఉపయోగ పడనుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన డీఎఫ్ సీసీఐఎల్ ఆధ్వర్యంలో 2 వేల మందితో సర్వే పనులు ముమ్మరం చేసింది. ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్న రైల్వే లైన్ కళ త్వరలోనే నెరవేరనుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.