పేద ప్రజలకు అందనున్న మరిన్ని వైద్య సౌకర్యాలు
రూ.2 కోట్లతో యంత్రం కొనుగోలు
కొనసాగుతున్న బిగింపు పనులు
ములుగు, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ములు గు జిల్లా దవాఖానలో సిటీ స్కానింగ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులతో అధునాతన సిటీ స్కానింగ్ యంత్రాన్ని అందజేసింది. ప్రత్యేకంగా కేటాయించిన గదుల్లో కొన్ని రోజులుగా యంత్రం బిగింపు పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా ప్రభుత్వం విలువైన రక్త, మూత్ర పరీక్షలు ఉచితంగా అందిస్తుండగా ప్రస్తుతం సిటీ స్కానింగ్ సేవలతో ప్రజలకు వైద్యపరంగా మెరుగైన సేవలందనున్నాయి. గతంలో ఇక్కడి ప్రజలు వరంగల్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ములుగు ప్రభుత్వ దవాఖానలో సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రయాణభారం తగ్గడంతో పాటు అత్యవసర సమయాల్లో రోగులకు చికిత్స అందించే అవకాశం ఏర్పడింది. 2022 నూతన సంవత్సరం మొదటి వారంలో ఈ సిటీ స్కానింగ్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్ తెలిపారు.