స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి విజయవాడకు రవాణా
తనిఖీల్లో సీజ్ చేసిన పోలీసులు
ఒరూ.30,760 విలువైన మద్యం స్వాధీనం
స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 28 : నూతన సంవత్సర వేడుకల కోసం రైళ్లో అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేసిన ఘటన మండల కేంద్రంలో వెలుగుచూసింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ రఘుచందర్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక రైల్వే స్టేషన్ నుంచి రైళ్లో అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారనే సమాచారం మేరకు సీఐ ఎడవెళ్లి శ్రీనివాస్‌రెడ్డి పోలీస్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. గోల్కొండ రైళ్లో మద్యాన్ని తరలించేందుకు నిందితులు యత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులు శివునిపల్లి గ్రామానికి చెందిన గుండ్లపల్లి రాజు, గుండ్లపల్లి భాస్కర్ ఉన్నారని ఏసీపీ రఘుచందర్ తెలిపారు. నూతన సంవత్సర వేడుకలకు ఇక్కడ కొనుగోలు చేసిన మద్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఎక్కువ ధరలకు అమ్మేందుకు తరలిస్తున్నారని ఆయన వివరించారు. వీరి వద్ద నుంచి రూ.30,760 విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేస్తున్నామని తెలిపారు. అక్రమంగా మద్యం తరలించినా, నిల్వ చేసిన చర్యలు తీసుకుంటామని రఘు చందర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎడవెళ్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలు కే శ్రీనివాస్, బీ శ్రావణ్ కుమార్, కుమార్, రమేశ్, హోంగార్డు తిరుపతి పాల్గొన్నారు.