ప్రపంచానికి ధ్వన్యనుకరణతో ఓరుగల్లు ఖ్యాతిని చాటారు
మేయర్ గుండు సుధారాణి
సిల్వెస్టర్‌కు స్మారక ప్రతిభా పురస్కారం ప్రదానం
పబ్లిక్ గార్డెన్లో ఘనంగా నేరెళ్ల జయంతి
హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 28 : మిమిక్రీ ఆర్టిస్ట్, పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. నేరెళ్ల వేణుమాధవ్ 90వ జయంతి సందర్భంగా హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని ఆయన కాంస్య విగ్రహానికి ఆమె మంగళవారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్, మిమిక్రీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభా పురస్కార ప్రదానంలో ముఖ్య అతిథిగా పాల్గొని మేయర్ మాట్లాడారు. నేరెళ్ల వేణుమాధవ్ తన ధ్వన్యనుకరణతో ఓరుగల్లు ఖ్యాతిని ప్రపంచానికి చాటారన్నారు. ఐక్యరాజ్య సమితిలో తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ కళాకారులను ప్రోత్సహిస్తున్నారని, పబ్లిక్ గార్డెన్లో నేరెళ్ల వేణుమాధవ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. రెండేళ్లు కరోనా కారణంగా కూడా అభిమానులు నేరెళ్ల వేణుమాధవ్‌ను స్మరించుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా నేరెళ్ల వేణుమాధవ్ కుటుంబంతో మేయర్ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి అంపశయ్య నవీన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే నేరెళ్ల వేణుమాధవ్ అంత గొప్ప కళాకారుడు లేరన్నారు. 2002 నుంచి నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ ద్వారా అన్ని రంగాల్లో పనిచేసినవారికి నేరెళ్ల వేణుమాధవ్ ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నామని, ఈసారి ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, కళారత్న ధ్వన్యనుకరణ రత్న సిల్వెస్టర్‌కు అందజేసినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా సిల్వెస్టర్‌కు మేయర్ గుండు సుధారాణి స్మారక ప్రతిభా పురస్కారం అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు మిమిక్రీ కళాకారులు సినీ హీరోల వాయిస్‌తో అలరించారు. ప్రముఖ ప్రజాకవి, సినీ రచయిత, గాయకుడు వరంగల్ శ్రీనివాస్ తన పాటతో అందరినీ ఆలోచింపజేశారు. పురస్కార గ్రహీత సిల్వెస్టర్ తన ధ్వన్యనుకరణతో అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ అధ్యక్షురాలు నేరెళ్ల శోభావేణుమాధవ్, కార్యదర్శి డాక్టర్ అంపశయ్య నవీన్, సభ్యులు నేరెళ్ల శోభావతి, నేరెళ్ల శ్రీనాథ్, నేరెళ్ల రాధాకృష్ణ, సలహామండలి సభ్యులు డాక్టర్ బండారు ఉమామహేశ్వర్రావు, గిరిజా మనోహర్‌బాబు, అత్తలూరి సత్యనారాయణ, వరిగొండ కాంతారావు, వనం లక్ష్మీకాంతారావు, కొణతం కృష్ణ, రామా చంద్రమౌళి, పొట్లపల్లి శ్రీనివాసరావు, మిమిక్రీ ఆర్టిస్టులు, కవులు, ప్రజలు పాల్గొన్నారు.