నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు
ఆబ్కారీ, పోలీస్ శాఖల సంయుక్త దాడులు
బెల్లం, పటిక రవాణాపై ప్రత్యేక నిఘా
1780 లీటర్ల గుడుంబా సీజ్.. 62,400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
జిల్లాలో తగ్గుముఖం విక్రయాలు
ఇప్పటివరకు 332 కేసులు నమోదు
192 మంది అరెస్ట్
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 28( నమస్తేతెలంగాణ) :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడుంబా, గంజాయిపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో గుడుంబా తయారీ, విక్రయాలపై ఆబ్కారీ, పోలీస్ శాఖలు సంయుక్తంగా దృష్టి సారించాయి. రెండు ఎక్సైజ్ సర్కిల్స్ (భూపాలపల్లి, కాటారం)పరిధిలో గుడుంబా కట్టడికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. నల్ల బెల్లం, పటిక వంటి ముడి పదార్థాల విక్రయాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. 2021 జనవరి నుంచి అక్టోబర్ వరకు జిల్లాలో 332 కేసులు నమోదు చేశారు. 192 మందిని అరెస్ట్ చేసి, 47 వాహనాలను జిల్లా ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. 1780 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, 62,400 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
రాష్ట్రంలో గుడుంబా నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. మత్తు పదార్థాల కట్టడి చేయాలని ఆయా జిల్లాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు గుడుంబా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్సైజ్, పోలీసుశాఖ సంయుక్తంగా 2021 జనవరి నుంచి అక్టోబర్ వరకు గుడుంబా తయారీ కేంద్రాలపై దాడులు చేసి 332 కేసులు నమోదు చేశారు. 192 మందిని అరెస్ట్ చేశారు. 1780 లీటర్ల గుడుంబాను సీజ్ చేయగా, 62,400 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. 7089 కేజీల బెల్లం, 535 కేజీల పటికను స్వాధీనం చేసుకున్నారు. 47 వాహనాలను సీజ్ చేసి, 40 మందిని బైండోవర్ చేశారు.
బెల్లం విక్రయాలపై నజర్..
గుడుంబా తయారీకి ఉపయోగించే ముడి సరుకు లు బెల్లం, పటిక విక్రయాలు, అక్రమ రవాణాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా జిల్లాలోని కాటారం, భూపాలపల్లితో పాటు ములుగు జిల్లాలోని, ములుగు, తాడ్వాయి, గోవిందరావుపేట నుంచి జరుగుతున్న అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు.
అధికారుల కనుసన్నల్లోనే విక్రయాలు?
నల్లబెల్లం, పటికల అక్రమ వ్యాపారం పోలీస్, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో పలుకుబడి కలిగిన ఓ వ్యక్తి బియ్యం వ్యాపారం ముసుగులో యథేచ్ఛగా బెల్లం, పటిక వ్యాపారాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాటారం సర్కిల్ పరిధిలో మేడారం కేంద్రంగా బెల్లం, పటికను అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిసింది. నియంత్రించాల్సిన ఉన్నతాధికారులకు నెల వారీ మామూళ్లు ముట్ట చెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.