ప్రజలగుండెల్లో విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్
అంతర్జాతీయ స్థాయిలో వేలాది మిమిక్రీ ప్రదర్శనలు
ఐక్యరాజ్యసమితిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చిన కళామతల్లి బిడ్డ
ఓరుగల్లులో ప్రత్యేక ప్రాంగణం, విగ్రహం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నేడు మాటల ‘మాంత్రికుడు’ నేరెళ్ల వేణుమాధవ్ జయంతి
పోచమ్మమైదాన్, డిసెంబర్ 27;తన గళాన్నే కళాక్షేత్రంగా చేసుకొని.. ధ్వన్యనుకరణలో వేలాది ప్రదర్శనలు ఇచ్చి మిమిక్రీలో విశ్వ విఖ్యాత సామ్రాట్‌గా ఎదిగిన నేరెళ్ల వేణుమాధవ్ అంటే తెలియనివారుండరు. ఐక్యరాజ్యసమితి వేదికగా ఆయనేంటో చాటడమే కాకుండా.. తెలంగాణకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. ఎవరి గొంతునైనా అలవోకగా అనుకరిస్తూ.. జంతు, పశుపక్ష్యాదుల శబ్దాలను తన నోటిద్వారా పలుకుతూ ప్రతి ఒక్కరినీ ప్రకృతి ఒడిలో విహరింపజేశారు. మిమిక్రీనే ప్రాణంగా చేసుకొని తన కళతో అందరినీ తనవైపు తిప్పుకొని ఎందరినో శిష్యులుగా తీర్చిదిద్ది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. నేడు ఆయన జయంతి సందర్భంగా హనుమకొండలోని నేరెళ్ల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో ధ్వన్యనుకరణ ద్వారా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు ఓరుగల్లు బిడ్డ నేరెళ్ల. నేడు ఆయన భౌతికంగా లేకున్నా ఆయన మిమిక్రీ కళా నైపుణ్యం వేనోళ్లా నానుతున్నది. వందలాది మంది నేరెళ్ల శిష్యులు తెలంగాణ కీర్తి, ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. నేరెళ్లకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సత్కారంతో పాటు నగదు బహుమతిని అందజేసి, కళాకారులకు గుర్తింపునిస్తున్నది. ఆయన పుట్టిన ఓరుగల్లు గడ్డలో ప్రత్యేకంగా నేరెళ్ల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయించి, ఆయన కుటుంబ సభ్యులకు, శిష్యులకు ప్రోత్సాహం కల్పించింది. నేడు నేరేళ్ల వేణుమాధవ్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
ఓరుగల్లులో శ్రీహరి-శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబర్ 28న వేణుమాధవ్ జన్మించారు. చిన్నప్పటి నుంచే సినిమాలు, నాటకాలపై ఇష్టం పెంచుకున్నారు. సినీనటులు చిత్తూరు నాగయ్య సినిమాలు చూసి సాహిత్యం, కళారంగం వైపు ఆకర్షితులయ్యారు. సినిమాల్లోని పాటలు, పద్యాలను అనుకరిస్తూ మిమిక్రీ కళకు శ్రీకారం చుట్టారు. హైస్కూల్‌స్థాయిలోనే ఆనాటి హరి రాధాకృష్ణమూర్తి, చిలుకమర్తి లక్ష్మీనరసింహనాటకాల్లో నటిస్తూ రంగస్థలంపైనా రాణించారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదువుతూ సినిమాల వైపు మొగ్గు చూపారు. నటీనటుల గొంతులు, సన్నివేషాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను తన గళం ద్వారా వినిపిస్తూ అందరి చూపు తనవైపు తిప్పుకున్నారు. నాటి ప్రిన్సిపాల్ బారు వెంకట రామనర్సు నేరెళ్లకు ఆ రోజుల్లోనే అరవై రూపాయల స్కాలర్ షిప్ మంజూరు చేశారు. దానితో నేరెళ్ల 30 ఇంగ్లిష్ సినిమాలను చూసి వాటిలోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్‌తో సహా వినిపిస్తే, రామనర్సు పరమానందభరితుడై ‘యూ విల్ బికం ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్’ నువ్వు నా రెండో కుమారుడవు’ అని మనసారా ఆశీర్వదించారు. ఆ దీవెనలే నేరెళ్లను ‘విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్’ గా ఎదిగేలా చేసాయి. 1953లో ప్రభుత్వ పాఠశాల (జీసీఎస్ స్కూలు హనుమకొండ)లో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి, ధ ర్మసాగర్, హనుమకొండలోని ప్రాక్టీసింగ్ స్కూలు, మట్వాడ ఉన్నత పాఠశాల, జనగామ, శంభునిపేట పాఠశాలల్లో పనిచేశారు.అనంతరకాలంలో ప్రైవేట్‌గా బీ.ఏ, బీ.కాం పాసయ్యారు.
కల్చరల్ ట్రస్ట్ ఏర్పాటు
ఆయన జన్మదినం సందర్భంగా 2001లో నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. రంగస్థలం, మిమిక్రీ, చిత్రలేఖనం తదితర రంగాల్లో విశేష కృషి చేస్తున్న కళాకారులకు నేరేళ్ల పేరిట ఏటా ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నారు. ఈ అవార్డు కింద రూ.20వేలు, ప్రశంసాపత్రం, మెమోంటోను ప్రదానం చేస్తున్నారు. రెండేళ్ల నుంచి ఎంపికైన మిమిక్రీ కళాకారుడికి రూ.5వేల నగదు అందిస్తూ సన్మానం చేస్తున్నారు.