ఆ తర్వాత తానూ కాల్చుకోవడంతో తీవ్ర గాయాలు
వెంకటాపురం సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో ఘటన
వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలింపు
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు..
మెస్రూమ్లో గొడవే కారణం?
వెంకటాపురం(నూగూరు), డిసెంబర్ 26 : ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు)లోని సీఆర్పీఎఫ్-39 బెటాలియన్ క్యాంప్‌లో ఆదివారం కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈఘటనలో సీఆర్పీఎఫ్ ఎస్సై ఉమేశ్‌చంద్ర అక్కడికక్కడే మృతిచెందగా, హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మెస్రూమ్ వద్ద జరిగిన గొడవ వల్లే ఎస్పైని తుపాకీతో కాల్చి.. ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ తనను తాను కాల్చుకున్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన హెడ్‌కానిస్టేబుల్ (మెస్ ఇన్చార్జి) స్టీఫెన్‌కు వరంగల్ ఎంజీఎంలో ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్‌కు తరలించారు. సెంట్రల్ సౌత్ జోన్ ఐజీ మహేశ్ చంద్ర లడ్డా ములుగుకు చేరుకొని కాల్పుల ఘటనపై ఆరా తీస్తున్నారు.
సీఆర్పీఎఫ్ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ మధ్య జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. ఎస్సైని హెడ్ కానిస్టేబుల్ గన్‌తో కాల్చి, తానూ కాల్చుకున్నాడు. దీంతో ఎస్సై చికిత్స కోసం దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ హెడ్ కానిస్టేబుల్‌ను హాస్పిటల్‌కు తరలించారు. ఈ సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) పోలీస్‌స్టేషన్ ఆవరణలోని సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ క్యాంప్‌లో ఆదివారం జరిగింది. క్యాంప్‌లో ఉదయం 8.30 గంటలకు మెస్ రూమ్ వద్ద టిఫిన్ తినే సమయంలో సీఆర్పీఎఫ్ ఎస్సై ఉమేశ్‌చంద్రకు, హెడ్‌కానిస్టేబుల్ (మెస్ ఇన్చార్జి) స్టీఫెన్‌కు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి గొడవ తీవ్రంగా మారింది. ఆవేశానికి గురైన హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్ క్యాంప్‌లోని వెపన్స్ రూమ్‌కు వెళ్లి తుపాకీతో ఎస్సైపై కాల్పులు జరిపి, తానూ కాల్చుకున్నట్లు తెలిసింది. కాగా కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరినీ చికిత్స కోసం పలువురు వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి 108లో ఏటూరునాగారం వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఉమేశ్‌చంద్ర మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడ్డ స్టీఫెన్‌ను మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. మెస్‌బిల్లుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగ్గా, మెస్ ఇన్చార్జి అయిన హెడ్ కానిస్టేబుల్ ఆవేశానికి గురై ఎస్సైపై కాల్పులు జరిపినట్లు తెలిసింది. గొడవకు గల పూర్తి కారణాలను సీఆర్పీఎఫ్ అధికారులు, పోలీసులు అధికారులు వెల్లడించడం లేదు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
మృతదేహాన్ని పరిశీలించినఎస్పీ, ఏఎస్పీలు
ఏటూరునాగారం : వెంకటాపురం సీఆర్పీఎఫ్ క్యాంపులో జరిగిన కాల్పుల్లో చనిపోయిన సీఆర్పీఎఫ్ ఎస్సై ఉమేశ్‌చంద్ర మృతదేహాన్ని ఎస్పీ సంగ్రాంసింగ్ జీ పాటిల్, ఏటూరునాగారం ఏఎస్పీలు అశోక్‌కుమార్ పరిశీలించారు. వెంకటాపురం నుంచి ఉమేశ్‌చంద్ర మృతదేహంతో పాటు గాయపడ్డ హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్‌ను ఏటూరునాగారంలోని సామాజిక వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం స్టీఫెన్‌ను ఎంజీఎం దవాఖానకు తరలిం చారు. కాగా, ఉమేశ్‌చంద్ర మృతదేహం ఏటూరు నాగారంలోని మార్చురీలో ఉంచగా, ఎస్పీ, ఏఎస్పీ పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు.
తలలోకి బుల్లెట్..
వరంగల్ చౌరస్తా : హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్‌కు ఎంజీఎంలో వైద్యులు చికిత్స చేశారు. క్యాజువాలిటీలో ప్రథమ చికిత్స తర్వాత స్కానింగ్ చేయించారు. ఎడమ గదవ కింది నుంచి తలలోకి బుల్లెట్ దూసుకుపోగా ఎడమ చెంప ఎముక విరిగిపోయిందని, ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతిన్నదని ఆర్ఎంఓ మురళి తెలిపారు. వైద్యం చేస్తున్న సమయంలో ఫిట్స్ రావడంతో ఆర్ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచినట్లు చెప్పారు. మధ్యాహ్నం అతడి ఆరోగ్యస్థితిని పరిశీలించిన వైద్యులు, ములుగు ఐజీ నాగిరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు మెరుగైన వైద్యసేవల కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఎంజీఎంలో బాధితుడికి అందించిన వైద్యసేవలను వరంగల్ ఏసీపీ గిరికుమార్, మట్టెవాడ సీఐ రమేశ్ పర్యవేక్షించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఆర్పీఎఫ్ ఐజీ
వెంకటాపురం(నూగూరు) : మండల కేంద్రంలోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ మధ్య జరిగిన కాల్పుల ఘటనపై సెంట్రల్ సౌత్ జోన్ ఐజీ మహేశ్‌చంద్ర లడ్డా ఆదివారం పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు. అనంత రం సీఆర్పీఎఫ్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన వెంట ములుగు ఏస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఏఎస్పీ అశోక్‌కుమార్ ఉన్నారు.