రాష్ట్రంలో పండుగలా వ్యవసాయం..
అన్నదాతకు భరోసా ఇచ్చిన రైతు బీమా
24గంటల విద్యుత్,సాగునీటితో పెరిగిన సాగు
పెట్టుబడి సాయం కింద రూ.10వేలు
అండగా నిలుస్తున్న సర్కారు పథకాలు
నేడు జాతీయ రైతు దినోత్సవం
వరంగల్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశానికి అన్నం పెట్టే రైతన్న సంతోషం కోసం రాష్ట్ర సర్కారు విశేష కృషిచేస్తోంది. ఎక్కడా లేని విధంగా వారి కోసం సంక్షేమ పథకాలు అమలుచేస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. నాడు సాగునీరు, సరిపడా విద్యుత్ లేక కరువుతో అల్లాడిన రైతాంగానికి అండగా నిలిచి రైతుబంధు, 24గంటల విద్యుత్, సమయానికి ఎరువులు, విత్తనాలు, సబ్సిడీపై వ్యవసాయ పరికరా లు అందిస్తూ అన్ని విధా లా ప్రోత్సహిస్తోంది. ఇటు సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్‌తో మునుపెన్నడూ లేని విధంగా సాగు విస్తీర్ణం పెరగడంతో రైతన్న ఇంటి సిరులపంట పండుతోంది. తెలంగాణలో కేసీఆర్ సర్కారు కొలువుదీరిన తర్వాత మారిన రైతు బతుకులు, వ్యవసాయంపై నేడు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ‘నమస్తే’ ప్రత్యేక కథనం..
రైతు దినోత్సవం ఎలా వచ్చిందంటే..
రైతుల కోసం అనేక ఉద్యమాలు చేసి వారి సంక్షేమం కోసం పాటుపడిన భారతదేశ ఐదవ ప్రధాని దివంగత చౌదరి చరణ్‌సింగ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటాం. చరణ్‌సింగ్ ఉద్యమాల ఫలితంగా రైతులకు శాపంగా మారిన జమీందారీ చట్టం రద్దయి కౌలుదారి చట్టం ఏర్పడింది. రైతులను వడ్డీ వ్యాపారుల కబంద హస్తాల నుంచి విడిపించేందుకు బ్యాంక్ రుణాలను ప్రవేశపెట్టడంలో చరణ్‌సింగ్ పాత్ర అమోఘం. ఆయన రైతులకు చేసిన సేవలతో పాటు వ్యవసాయరంగంపై చూపిన ప్రతిభా పాఠవాలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహిస్తోంది.
మారిన రైతు బతుకులు..
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నది. పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన చిన్న జిల్లాలతో అందరికంటే ఎక్కువగా రైతులకే ఉపయోగపడుతున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎరువులు, విత్తనాలు గతంలో కంటే ఎక్కువగా అందుతున్నాయి. మరోవైపు సబ్సిడీ యంత్రాలు కూడా మునుపటికంటే పెరిగాయి. మిషన్ భగీరథలో భాగంగా చెరువుల పూడికతీత, కాలువల మరమ్మతులతో వ్యవసాయం మరింత ఉత్సాహంగా సాగుతోంది. ప్రభుత్వం ఓ వైపు సబ్సిడీ పథకాలు రైతులకు అందజేస్తూనే మరోవైపు పెట్టుబడి కోసం ముందస్తుగా బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణ సౌకర్యం కల్పిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీ అయిన రుణమాఫీని పూర్తిగా అందజేసి, ప్రస్తుతం రుణం తీసుకునే రైతులకు ఆయా పంటల అనుసారంగా రుణ పరిమితిని పెంచి ఇవ్వడం ఎంతో ఉపయోగపడుతోంది. విత్తనాలు, ఎరువులను కూడా ముందే సిద్ధంగా ఉంచింది. 24గంటల నిరంతర త్రీఫేజ్ విద్యుత్‌ను అందిస్తోంది. సబ్సిడీపై విత్తనాలు, యంత్రాలను అందజేస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే పరిహారం ఇచ్చేందుకు బీమా సౌకర్యాన్ని కల్పించింది. ప్రతి ఒక్క రైతు పంట బీమా చేసుకునేలా ప్రోత్సహిస్తోంది.