ఏటేటా విస్తరిస్తున్న సింగరేణి కార్యకలాపాలు
స్వరాష్ట్రంలో దూసుకెళ్తున్న కంపెనీ
ఎల్లలు దాటి ఇతర రాష్ర్టాలకూ విస్తరణ
బొగ్గుతో పాటు విద్యుదత్పత్తిలోనూ సక్సెస్
ఇప్పటికే విజయవంతంగా సేవలందిస్తున్న ఎస్టీపీపీ
వచ్చే రెండేళ్లలో నీటిపై తెలియాడే సోలార్ పాజెక్టులు
భూగర్భ నీటితో జియో థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు
భావితరాలకు జీవనాధార పరిశ్రమగా మారిన సంస్థ
శ్రీరాంపూర్, డిసెంబర్ 21 : దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు ఉత్పత్తి కంపెనీల్లో రారాజుగా నిలుస్తున్న సింగరేణికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి, రక్షణ చర్యలు, రవాణాల్లో రికార్డు సృష్టిస్తూ, వివిధ అవార్డులు పొందుతూ ఇతర పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తున్నది. కాగా, బొగ్గు ఉత్పత్తితో పాటు భవిష్యత్‌లో విద్యుదుత్పత్తి చేసేందుకూ ప్రణాళిక రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నది.
ఏడాదిలోగా నీటిపై తేలియాడే సోలార్ ప్లాంటు
సింగరేణి వ్యాప్తంగా నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్లాంట్లలో వచ్చే ఏడాదిలోగా 15 మెగావాట్ల ప్లాంట్లను సంస్థ సిద్ధం చేస్తున్నది. తొలి విడుతగా 5 మెగావాట్ల ప్లాంట్‌ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సింగరేణి నిర్ణయించింది. మూడు దశల సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో ఇప్పటికే 172 మెగావాట్ల ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పాదన ప్రారంభించింది. మొదటి దశలో మిగిలి ఉన్న 10 మెగావాట్ల ప్లాంట్(రామగుండం-3), కొత్తగూడెంలో 37 మెగావాట్ల ప్లాంట్‌ను ఈ నెలాఖరుకల్లా ప్రారంభించాలని, తద్వారా 219 మెగావాట్ల సామర్థ్యాన్ని చేరుకోవాలని భావిస్తున్నారు. కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయంపై సింగరేణి సంస్థ నిర్మించ తలపెట్టిన 250 మెగావాట్ల(డీసీ) ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు నిర్మాణం ఏజెన్సీ ఎంపికకు సంబంధించిన టెండరు నియమ నిబంధనలను డిసెంబరు లోగా రూపొందించనున్నారు. ప్రభుత్వ అనుమతుల అనంతరం మార్చి నెలలో టెండర్లు పిలవడానికి సిద్ధమవుతున్నారు.
సింగరేణికి వరంగా మారనున్న నైనీ బొగ్గు బ్లాక్..
ఒడిశా రాష్ట్రంలో సింగరేణి ప్రారంభించనున్న భారీ బొగ్గు గని నైనీ బ్లాక్ సంస్థకు వరంగా మారనుంది. ఈ బ్లాక్‌కు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని అనుమతులు పూర్తి చేసుకుంది. ఈ గనిలో బొగ్గు ఉత్పత్తికి వేగంగా అడుగులు వేయనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21లో ఈ గని నుంచి 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టారు. ఆ దిశగా సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. సింగరేణి సంస్థ ఇతర రాష్ర్టాలకు విస్తరించాలనే ఆకాంక్ష మేరకు ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు బ్లాకులో బొగ్గు ఉత్పత్తికి సిద్ధమవడం సంతోషకరమని చెప్పవచ్చు. పర్యావరణానికి ఎలాంటి హానీ కలుగకుండా చర్యలు చేపట్టనున్నారు. ఇక్కడ మొత్తం 340 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలుండగా ఈ గని నుంచి ఏడాదికి 10 మిలియన్ టన్నుల చొప్పున 38 ఏళ్ల పాటు బొ గ్గు ఉత్పత్తి చేయనుంది. మొత్తం 912 హెక్టార్ల విస్తీర్ణం గల ఈ గని ఎక్కువ శాతం అనగా 783 హెక్టార్ల అటవీ భూమిలోనే విస్తరించి ఉంది. సింగరేణిలో ప్రస్తుతం ఓసీ గనుల్లో టన్ను బొగ్గు ఉత్పత్తికి 6 నుంచి 7 క్యూబిక్ మీటర్ల మట్టి (ఓ బీ) తొలగించాల్సి ఉండగా నైనీ బ్లాక్ ఓసీపీలో ఒక టన్ను బొ గ్గు ఉత్పత్తికి 2.5 మీట్ల మట్టి (ఓబీ) తొలగిస్తే సరిపోతుంది. అంతే కాకుండా బొగ్గు ఎంతో నాణ్యమైంది. సగటున జీ-10 గ్రేడ్ బొగ్గు లభ్యమవుతుంది. ఏడాదికి 80 లక్షల టన్నుల సామర్థ్యం గల ఒక వాషరీ కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. షావల్ డంపర్, సర్ఫేస్ మైనర్ విధానం ద్వారా బొగ్గు తవ్వనున్న ఈ ఓసీపీలో సుమారు 1200 మంది ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ 1200 ఉద్యోగులు పని చేసే అవకాశం ఉంది. గని ఏర్పాటుకు సింగరేణి ఐదేళ్లుగా కృషి చేస్తున్నది.
సంస్థ బొగ్గుకు డిమాండ్..
సింగరేణి సంస్థ బొగ్గు నాణ్యతా ప్రమాణాలు పెంచుతూ ఉత్పత్తి రవాణా చేయడం వల్ల దేశంలో సింగరేణి బొగ్గు మంచి డిమాండ్ ఉంది. సంస్థ ఉత్పత్తి, రవాణాకు సమ ప్రాధాన్యతనిస్తూ అమ్మకాలపై పెద్ద ఎత్తున దృష్టి సారించింది. ఈ ఏడాది సింగరేణి సంస్థ 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. 100 శాతానికి దగ్గరగా సాధిస్తూ వస్తున్నది. సంస్థ ఉత్పత్తి తీస్తున్న బొగ్గులో 80 శాతం విద్యుత్ పరిశ్రమలు, 20 శాతం నాన్ పవర్ సెక్టార్, చిన్నతరహా పరిశ్రమలకు విక్రయిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ బొగ్గుకు మార్కెటింగ్ అవకాశాలను పెంచి, తద్వారా విదేశీ దిగుమతులు తగ్గించేందుకు కృషి జరుగుతోంది. సింగరేణికి అదనంగా 2 మిలియన్ టన్నుల బొగ్గును నాన్ రెగ్యులేటెడ్ సంస్థలకు ఈ వేలం లింకేజీ ద్వారా నోటిఫైడ్ ధరకే విక్రయించేందుకు అవకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశ పెట్టిన ఆక్షన్ ఆఫ్ లింకేజీ(ఏవోఎల్) విధానం ద్వారా పూర్తి పారదర్శకంగా బొగ్గు విక్రయాలను చేసేందుకు అవకాశం లభించింది, ఈ పద్ధతి ద్వారా ఇప్పటికే ఆరు సార్లు సింగరేణి వేలం నిర్వహించి సిమెంట్, క్యాప్టీవ్ పవర్, స్పాంజ్ ఐరన్, పేపర్, ఫార్మా డ్రగ్స్ తదితర సంస్థలకు 10-9 మిలియన్ టన్నుల బొగ్గును లింకేజీ చేసిన విషయం తెలిసిందే. ఏడోసారి అదనంగా 2 మిలియన్ టన్నులకు ఈ-వేలం నిర్వాహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విదేశీ బొగ్గుతో పోల్చుకుంటే సింగరేణి బొగ్గు వాడడం వల్ల కలిగే అదనపు ప్రయోజనాలను సంస్థ వివిధ పరిశ్రమలకు అవగాహన కల్పిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నది. దీంతో సింగరేణి సంస్థకు రాబోయే ఐదేళ్ల వరకు ఉన్న మార్కెటింగ్ అవకాశాలతో పాటు అదనంగా 2 నుంచి 3 మిలియన్ టన్నులకు ఈ వేలం ద్వారా బొగ్గు అమ్మకాలు జరిపే అవకాశం ఉంది. సింగరేణి సంస్థ 2021-22 సంవత్సరానికి 705.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది.
ఆరు నెలల్లో జియో థర్మల్ విద్యుత్ కేంద్రం రెడీ..
బొగ్గు ఉత్పత్తితో పాటు ఇప్పటికే థర్మల్, సోలార్ విద్యుత్ రంగాల్లోకి అడుగు పెట్టిన సింగరేణి కాలరీస్ తాజాగా భూగర్భం నుంచి ఉబికి వచ్చే వేడి నీటితో విద్యుత్‌ను తయారు చేసే (జియోథర్మల్) కేంద్రాన్ని మరో 6 నెలల్లో ప్రారంభించనుంది. దేశంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ జియో థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణంపై సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. సింగరేణి అధికారులు, నిర్మాణ సంస్థ శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆర్థిక సంవత్సరం మార్చి నాటికల్లా నిర్మాణం పూర్తి చేసి జియో థర్మల్ విద్యుత్ ఉత్పాదన చేయాలని ఆదేశించారు. మణుగూరు ఏరియా పరిధిలోని అటవీ, గిరిజన గ్రామాలైన పగిడేరు, ఖమ్మంతోగు, బుగ్గ తదితర గ్రామాల్లో వేడి నీటి మడుగులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో సింగరేణి సంస్థ అధికారులు తమ బొగ్గు ఆన్వేషణలో భాగంగా బోర్ హోల్స్ వేస్తున్నప్పుడు ఈ విషయాన్ని గమనించారు. శాస్త్రీయ అధ్యయనం అనంతరం ప్లాంట్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన సంబంధిత శాఖ, పగిడేరు ప్రాంతంలో 20 కిలో వాట్ల విద్యుత్‌ను ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేయడానికి రూ.1.72 కోట్లను కేటాయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ప్లాంట్ విడి భాగాలు పగిడేరుకు రప్పించి అమర్చాలని, వచ్చే 30 మార్చి 2022 కల్లా విద్యుత్ ఉత్పాదన ప్రారంభం కావాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మణుగూరులో చేపడుతున్న జియో థర్మల్ ప్రయోగం విజయవంతం అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటువంటి ప్రాజెక్టులు మరిన్ని చేపట్టే అవకాశం ఉంది.