జనగామచౌరస్తా, డిసెంబర్ 21 : ప్రతి ఒక్క రూ అన్ని మతాలను గౌరవించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సూర్యాపేట రోడ్డులో ఉన్న ఎన్ఎంఆర్ గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ‘క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆర్గనైజింగ్ కమిటీ 2021’ ఆధ్వర్యంలో క్రైస్తవులకు కానుకలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని మతాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు. పండుగ పూట పేదవారు కొత్త దుస్తులు ధరించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కానుకలు అందజేస్తున్నట్లు తెలిపారు. బైబిల్, భగవద్గీత, ఖురాన్ ఏ గ్రంథమైనా అన్ని మతాలను గౌరవించాలని, కలిసి మెలిసి జీవించాలని చెబుతాయన్నారు. పసరమడ్ల గ్రామం పరిధిలో గ్రేవ్ యార్డుకు రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇచ్చేందుకు గతంలో కలెక్టర్ నుంచి జీపీ వరకు తీర్మానం చేశారు. కానీ, జనగామ జిల్లాగా ఆవిర్భవించడంతో ఆలస్యం జరిగిందన్నారు. త్వరలో క్రైస్తవుల కోరిక మేరకు గ్రేవ్ యార్డుకు స్థలా న్ని కేటాయించనున్నట్లు చెప్పారు. ఒకప్పుడు సాగు,తాగు నీటికి తండ్లాడిన జనగామ ప్రజలు నేడు ఆనందంగా ఉన్నారని అన్నారు. దీనికి తోడు రైతులు అప్పుల పాలు కాకుండా రైతుబంధు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తోందన్నారు. దీంతో వంద కోట్ల మందికి అన్నం పెట్టగలిగిన స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయనని కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, సీఎం కేసీఆర్ కేంద్రంతో పోరాడుతున్నారని, దీనికి క్రైస్తవ సమాజం మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. క్రిస్టియన్ భవనం నిర్మాణానికి స్థల సేకరణపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య తెలిపారు. అనంతరం ‘ప్రేమవిందు’ను ప్రారంభించి భోజనం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సీహెచ్ మధుమోహన్, తహసీల్దార్ రవీందర్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు యాటెల్లి చిట్టిబాబు ఇజ్రాయేల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొర్లపాటి మధుకుమార్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ పీ సుగుణాకర్రాజు, మున్సిపల్ చైర్మన్ పోకల జమున, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దె విజయ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, జడ్పీటీసీ నిమ్మతి దీపిక, తరిగొప్పుల, బచ్చన్నపేట ఎంపీపీ జొన్నగోని హరిత, నాగజ్యోతి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు బొల్లం శారద, మున్సిపల్ వైస్ చైర్మన్ రాంప్రసాద్, కౌన్సిలర్లు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, పగిడిపాటి సుధ, సమద్, మామిడి లాజర్, స్టాలిన్, శైలస్ పాల్గొన్నారు.