12 మంది నిందితుల అరెస్ట్.. పరారీలో మరో ముగ్గురు
ఆరు ల్యాప్‌టాప్‌లు, ఒక ఐప్యాడ్, రెండు ప్రింటర్లు, ఐదు సీపీయూలు, సామగ్రి స్వాధీనం
నకిలీ సర్టిఫికెట్లతో ఉమ్మడి వరంగల్ నుంచి 300 మంది విదేశాలకు..
వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి
సుబేదారి, డిసెంబర్ 21 : నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 12 మంది సభ్యుల ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. వారి నుంచి నకిలీ సర్టిఫికెట్ల తయారీకి ఉపయోగించిన సామగ్రి, 6 ల్యాప్‌టాప్‌లు, ఒక ఐప్యాడ్, 2 ప్రింటర్లు, 5 సీపీయూలు, 25 నకిలీ రబ్బర్ స్టాంపులు, 2 ప్రింటర్ రోలర్స్, 5 ప్రింటర్ కలర్స్ బాటిల్స్, ఒక ల్యామినేషన్ మిషన్, 12 సెల్ఫోన్లు, 10 ల్యామినేషన్ గ్లాస్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిందితుల అరెస్టు వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి వెల్లడించారు.
ప్రధాన నిందితుడు మహబూబాబాద్‌కు చెందిన డీ అరుణ్, నర్సంపేట ద్వారకాపేటకు చెందిన ఆకుల రవి, హనుమకొండ కనకదుర్గ కాలనీకి చెందిన మామిడి శ్రీకాంత్ (కన్సల్టెన్సీ), పోస్టల్‌కాలనీకి చెందిన మీర్జా అక్తర్అలీబేగ్, ఎక్సైజ్కాలనీకి చెందిన పోగుల సుధాకర్‌రెడ్డి, మామిడి స్వాతి, గాంధీనగర్‌కు చెందిన బాలోజు శ్రీనాథ్, సుబేదారికి చెందిన అంబటి ఉత్తమ్కిరణ్, గుండ్లసింగారానికి చెందిన నల్లా ప్రణయ్, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లికి చెందిన అరందుల మహేశ్, మడికొండ నెహ్రూనగర్‌కు చెందిన మాదిశెట్టి సచిన్ (కన్సల్టెన్సీ), హైదరాబాద్ ఘట్కేసర్కు చెందిన చిదాల సలోని అలియాస్ రాధను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌యాదవ్, హనుమకొండకు చెందిన కుందారపు కృష్ణా, నరిశెట్టి సురేందర్ పరారీలో ఉన్నారు.
దేశవ్యాప్త యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్ల తయారీ
ముఠా సభ్యులు అరుణ్, రవి, అవినాశ్ వరంగల్‌లోని కేయూ, ఏపీలోని నాగార్జున, ఆంధ్రా యూనిర్సిటీలతోపాటు కర్నాటక, తమినాడు, బీహార్ తదితర రాష్ర్టాల్లోని యూనివర్సిటీల్లో మెరిట్ మార్కులతో పాస్ అయినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి కన్సల్టెన్సీ సంస్థలకు అందజేసేవారు. ఒక్కో నకిలీ సర్టిఫికెట్‌కు కన్సల్టెన్సీ సంస్థల నిర్వాహకులు రూ.లక్ష నుంచి రూ.నాలుగు లక్షల వరకు డబ్బులు తీసుకుని విద్యార్థులను విదేశాలకు పంపేవారు.
అనుమానం రాకుండా ..
నకిలీ సర్టిఫెకెట్ల తయారీలో విదేశీ విద్యా సంస్థలకు ఎక్కడ కూడా అనుమానం రాకుండా ముఠా సభ్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. సర్టిఫికెట్ల తయారీ కోసం ఆన్లైన్లో క్వాలిటీ పేపర్ కొనుగోలు చేసేవారు. యూనివర్సిటీల పేరుతో రబ్బర్ స్టాంపులు, హెచ్వోడీస్ సంతకాలు చేసేవారు. విదేశీ విద్యా సంస్థల్లో చదవాలంటే కనీస మార్కులు తప్పనిసరి. దీంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల ఆధారంగా మెరిట్ మార్కులతో నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసేవారు.
టాస్క్‌ఫోర్స్ పోలీసుల ప్రత్యేక నిఘా
ఈముఠా నకిలీ వ్యవహారంపై 15 రోజుల క్రితం వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. టాస్క్‌ఫోర్స్ ఇన్చార్జి అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ విభాగం పోలీసులు ముఠాపై ప్రత్యేక నిఘా పెట్టారు. కన్సల్టెన్సీ సంస్థలపై దాడులు చేసి దేశంలోని వివిధ రాష్ర్టాల యూనివర్సిటీలకు చెందిన 212 మంది నకిలీ సర్టిఫికెట్లు, వీటికి ఉపయోగించిన మిషనరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్చార్జి అదనపు డీసీపీ వైభవ్‌గైక్వాడ్, సీఐలు శ్రీనివాస్‌జీ, సంతోష్, ఎస్సైలు ప్రేమానందం, ప్రియదర్శిని, హెడ్‌కానిస్టేబుల్ శ్యాంసుదర్, కానిస్టేబుళ్లు మహేందర్, సృజన్, శ్రీకాంత్, అలీ, డ్రైవర్ శ్రీనివాస్‌ను సీపీ అభినందించారు.
పోలీస్ ఆఫీసర్ కొడుకు, ఓ ప్రజాప్రతినిధి కుమారుడు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ కుమారుడు, హనుమకొండకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడు ఈ ముఠా సభ్యుల నుంచి నకిలీ సర్టిఫికెట్లు పొంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఇద్దరిలో ఒకరిది చదువు పూర్తికాగా, మరొకరు చదువు కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల పిల్లలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల పిల్లలు, వ్యాపారుల పిల్లలు, సంపన్న వర్గాలకు చెందిన పిల్లలు పెద్ద సంఖ్యలో ఈ నకిలీ సర్టిఫికెట్లతో విదేశాల్లో ఉన్నత చదువుల పేరుతో ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈముఠా ఒక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే 300 మందికిపైగా విద్యార్థులను నకిలీ సర్టిఫికెట్లతో ఇతర దేశాలకు పంపించినట్లు వినికిడి. అలాగే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలతోపాటు దేశ వ్యాప్తంగా మూడువేల మందికి పైగా విద్యార్థులు నకిలీ సర్టిఫికెట్లతో విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఈ ముఠా నుంచి ఎంతమంది విద్యార్థులు నకిలీ సర్టిఫికెట్లు పొంది విదేశాలకు వెళ్లారనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు