సాగుకు భారీగా రాయితీలు
హెక్టారుకు రూ.12 నుంచి 29 వేలకు పెంపు
పంటకు అనుకూలంగా భూపాలపల్లి నేలలు
జిల్లాలో 300 ఎకరాల్లో సాగుకు సన్నాహాలు
ఈ యేడు ముందుకొచ్చిన 140మంది రైతులు
సిద్ధంగా 18వేల మొక్కలు.. అక్టోబర్ నుంచి పంపిణీ
బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 21 (నమస్తేతెలంగాణ) : రైతులను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. సంప్రదాయ పంటలకు బదులు వాణిజ్య పంటల వైపు అన్నదాతలను ప్రోత్సహిస్తున్నది. ఎక్కువ లాభాలనిచ్చే ఆయిల్‌పామ్ సాగు కోసం భారీగా రాయితీలు ప్రకటించింది. హెక్టారుకు రూ.12వేల నుంచి రూ. 29 వేలకు పెంచింది. ఆయిల్‌పామ్ సాగుకు జిల్లాలో అనుకూలమైన నేలలు ఉండడంతో ఈయేడు 140 మంది రైతులు సుమారు 300 ఎకరాల్లో ఈ పంట పండించేందుకు ముందుకురాగా, వీరికి పంపిణీ చేసేందుకు జిల్లాలోని నర్సరీలో 18వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వీటిని అక్టోబర్ నుంచి పంపిణీ చేసేందుకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.
రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా సాంప్రదాయ పంటలకు బదులు వాణిజ్య పంటలు సాగు చేసేలా వారిని ప్రోత్సహిస్తున్నది. ఆయిల్ పామ్ సాగు చేసేలా వ్యవసాయశాఖ, ఉద్యాన శాఖల అధికారులు అవగాహన కలిగిస్తున్నారు. దీనికి తోడు గతం లో హెక్టారుకు రూ. 12వేల రాయితిని ఇచ్చిన ప్రభుత్వం ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశ అనంతరం రాయితీని మరో రూ. 17లు పెంచి హెక్టారుకు రూ. 29 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ సంవత్సరం 140 మంది రైతులు సుమారు 300 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరికి పంపిణీ చేసేందుకు జిల్లాలోని నర్సరీలో 18వేల మొక్కలు సిద్ధంగా ఉంచారు. అక్టోబర్ నుంచి పంటలు సాగు చేయనున్న క్రమంలో రైతులకు మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా అధికారులకు సన్నాహాలు చేస్తున్నారు.
రాయితీ పెంపు….
ఆయిల్‌పామ్ సాగుకు ఎకరానికి రూ.60 వేల ఖర్చు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వం ప్రకటించిన రాయితీ రూ. 12వేలు ఉండగా దానికి మరో రూ.17 వేలు కలిపి రూ. 29 వేలు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పోను మిగతా పెట్టుబడిని బ్యాంకు రుణాల రూపంలో రైతులకు ఇచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
పంపిణీకి సిద్ధంగా 18 వేల మొక్కలు
ఆయిల్‌పామ్ పంటను అధికంగా సాగు చేసేలా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రోత్సహిస్తున్నారు. గతంలో స్థానిక రైతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంటను పరిశీలించేందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో జిల్లాలో 300 ఎకరాల్లో సాగు చేసేందుకు 140 మంది రైతులు ముందుకొచ్చారు. వీరికి పంపిణీ చేసేందుకు రేగొండ మండలంలో ఏర్పాటు చేసిన నర్సరీలో 18 వేల మొక్కలు పెంచుతున్నారు.
అక్టోబర్‌లో పంపిణీ
ఎకరానికి 58 మొక్కల చొప్పున రైతులకు అందజేయనున్నారు. వచ్చే సంవత్సరం నాటికి జిల్లాలో సుమారు 10వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేసేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.