హిట్లర్‌కు పట్టిన గతే ఆయనకు పడుతుంది
సీఎం కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర
ధాన్యం కొనుగోళ్లపై పునరాలోచించాలి
రైతు ధర్నాలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జయశంకర్ జిల్లాలో రైతు ధర్నా, గ్రామాల్లో చావు డప్పులు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా అడ్డంకులు కలిగిస్తూ సీఎం కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఆహర పాలసీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందన్నారు. దేశంలో ఎక్స్పోర్ట్ పాలసీని ప్రోత్సహించకుండా ప్రధాని మోదీ రాష్ర్టాల ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించడం మంచిపద్ధతి కాదన్నారు. నియంతలా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేకమేడలా కూలిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న మోదీకి హిట్లర్‌కు పట్టిన గతి పడుతుందని అన్నారు. వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వానికి చలనం లేదని, పంటను కొనుగోలు చేయకుంటే తగిన మూల్యం చెల్లించుంకుంటుదన్నారు. జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు మాట్లాడుతూ ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి నిల్వ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు.
చావు డప్పులు.. దిష్టి బొమ్మల దహనాలు
సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని 11 మండలాల పరిధిలో ఉదయం 7గంటలకు ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చావు డప్పులు మోగించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేశారు.
జాతీయ రహదారిపై వంటవార్పు
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వంట వార్పు చేపట్టి, రోడ్డుపై సహపంక్తి భోజనాలు చేపట్టారు. జాతీయ రహదారి 353సీపై కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా అనంతరం తరలి వచ్చిన రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ జాతీయ రహదారిపై సహపంక్తి భోజనం చేశారు. దీంతో వాహనాలు భారీగా నిలిచి, ట్రాఫిక్ స్తంభించింది. కిలో మీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభ, మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, ఎంపీపీ మందల లావణ్య, పీఏసీఎస్ చైర్మన్లు మేకల సంపత్‌కుమార్, పూర్ణచందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, టీఆర్ఎస్ నాయకులు కళ్లెపు రఘుపతిరావు, క్యాతరాజు సాంబమూర్తి, సెగ్గం సిద్ధు, విద్యాసాగర్‌రెడ్డి, బుర్ర రమేశ్, రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్లు, రైతులు పాల్గొన్నారు.