సవరణ బిల్లును విరమించుకోకుంటే ఢిల్లీలో ఆందోళన చేస్తాం
టీఈఈయూ (1104) రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు
రైతుచట్టాల్లాగే విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు డిమాండ్
హనుమకొండ సిటీ, డిసెంబర్ 20 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఉచిత విద్యుత్ పొందుతున్న తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. 1104 ఉమ్మడి జిల్లా సర్వసభ్య సమావేశం సాయిని నరేందర్ అధ్యక్షతన సోమవారం హనుమకొండలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు వేంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యుత్ ప్రైవేటీకరణ అంశాన్ని విరమించుకోకపోతే ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిరసన చేపడుతామని హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌శాఖను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తే 1104 పోరాటాలు చేసి కోర్టుకు వరకు వెళ్లి అడ్డుకుందని గుర్తుచేశారు. 1104 సంఘం వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వదని, సమష్టి నిర్ణయాలతోనే ముందుకు వెళ్తుందన్నారు. ఆర్టిజన్ కార్మికుల క్యాడర్, పేరు మార్పు విషయాన్ని సీఎండీ ప్రభాకర్‌రావు దృష్టికి ఇటీవలే తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు మాట్లాడుతూ రైతు చట్టాలపై ఎలాగైతే కేంద్రం వెనక్కి తగ్గి రద్దు చేసిందో అదే తరహాలో విద్యుత్ సవరణ బిల్లును సైతం రద్దు చేయక తప్పదన్నారు. 2016 సంవత్సరంలో 1104 సంఘం ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, చలో వరంగల్ పేరుతో 13 సంఘాలను ఐక్యం చేసి (టీ- టీయూపీ) తెలంగాణ ట్రెడ్ యూనియన్ ఆఫ్ ఫ్రంట్‌గా ఏర్పడి, పోరాటం చేయగా ప్రభుత్వం 23వేల మందిని ఆర్టిజన్ కార్మికులుగా ప్రకటించడం జరిగిందన్నారు. ఇవాళ ఆర్టిజన్ కార్మికులకు భద్రత ఉందంటే కేవలం 1104 సంఘం పోరాట ఫలితమే అన్నారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ పద్మారెడ్డి, కంపెనీ ప్రెసిడెంట్ రఘునందన్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సీహెచ్.తిరుపతిరెడ్డి, అదనపు కార్యదర్శి కె.రంగారావు పాల్గొన్నారు.