జనగామ చౌరస్తా, డిసెంబర్ 20 : భూవివాదంలో మనస్తాపానికి గురైన ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగింది. బాధితులు నిమ్మల నర్సింగరావు, నిమ్మల లక్ష్మయ్యతోపాటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ మండలంలోని పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల మైసయ్య పేరిట సర్వే నంబర్ 159, 160, 156, 231/డి, 248, 280లో మొత్తం 7 ఎకరాల 29 గుంటల పట్టా భూమి ఉంది. కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం మైసయ్య ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఎలుబాక గ్రామానికి వలసవెళ్లాడు. ఇదే గ్రామానికి చెందిన నిమ్మల యాదగిరి, నిమ్మల నర్సమ్మ, నిమ్మల ఎల్లయ్య, నిమ్మల పాండు మైసయ్య పేరిట ఉన్న 7 ఎకరాల 29 గుంటల పట్టా భూమిని అన్యాయంగా వారి పేరున మార్చుకొని అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాలను పొందారు. పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల లక్ష్మయ్య, ఇతడి తండ్రి నిమ్మల సంగయ్య పేరిట సర్వే నంబర్ 154, 155, 156, 159, 160, 180, 231/డి, 248, 259, 280లో కలిపి మొత్తం 7 ఎకరాల 20 గుంటల పట్టా భూమి ఉంది. బతుకుదెరువు కోసం నిమ్మల లక్ష్మయ్య సిరిపురం గ్రామానికి వలస వెళ్లాడు. ఈ క్రమంలో పసరమడ్లకు చెందిన తమ దాయాదులైన నిమ్మల యాదగిరి, నిమ్మల నర్సమ్మ, నిమ్మల ఎల్లయ్య, నిమ్మల పాండు తమ పేరిట ఉన్న 7 ఎకరాల 20 గుంటల పట్టా భూమిని మార్చుకొని అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాలను పొందారని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై జనగామ రెవెన్యూ అధికారులకు పలుమార్లు విన్నవించినా న్యాయం జరగలేదని ఆరోపించారు. దీంతో విసిగిపోయి సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని రక్షించారు.
భూతగాదాపై గతంలోనే విచారణ జరిపాం : రవీందర్, తహసీల్దార్
భూతగాదాపై గతంలోనే విచారణ జరిపాం. ఇది సివిల్ తగాదా. బాధితులు నిమ్మల నర్సింగరావు, నిమ్మల లక్ష్మయ్యకు సంబంధించిన దాయాదులు 2016లోనే తమ పేరిట పట్టా పాసు పుస్తకాలను పొంది కబ్జాలో ఉన్నట్లుగా తెలిసింది. బాధితులు నిమ్మల నర్సింగరావు, నిమ్మల లక్ష్మయ్య కబ్జాలో లేరని బాధితుల వాదన. అక్రమంగా పట్టాలు చేసుకుంటే బాధితులిద్దరూ సంబంధిత ఆధారాలతో సివిల్ కోర్టులో భూమి పట్టాల రద్దు కోసం కేసు ఫైల్ చేయాలని సూచించాం. 2020లో కూడా బాధితులను ఈ విషయంలో సివిల్ కోర్టుకు వెళ్లమని జనగామ ఆర్డీవో సూచించిచారు.