జయశంకర్ జిల్లాలో 200 కేంద్రాల ఏర్పాటు
ధాన్యం వివరాలను వెంటనే ఆన్లైన్ లో నమోదు చేయండి
కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశాలు
భూపాలపల్లి రూరల్, డిసెంబర్ 20 : కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ఆన్లైన్లో పొందుపరిచి, రైతులకు త్వరగా డబ్బులు అందేలా చూడాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సహకార, జీసీసీ, డీఆర్డీవో (ఐకేపీ) అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 200 కేంద్రాల్లో పీఏసీఎస్, ఐకేపీ, జీసీసీ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. జిల్లాలో లక్షా నలభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 19,368 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధికారులు ఆన్లైన్లో నమోదు చేయకపోవడం వల్ల రైతులకు డబ్బులు ఇవ్వడంలో ఆలస్యమవుతున్నదన్నారు. ధాన్యం వివరాలను వెంటనే ఆన్లైన్లో పొందుపర్చి రైతులకు త్వరగా డబ్బులు అందేలా చూడాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు వారి వారి శాఖల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి రోజూ సందర్శించాలని ఆదేశించారు. అలాగే ధాన్యం మిల్లులకు పంపించడంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.కొనుగోలు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన జీజీసీ మేనేజర్ హరిలాల్, జిల్లా సహకార అధికారి మద్దిలేటిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణలో వేగంపెంచి రైతులకు త్వరగా డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్, సివిల్ సైప్లె జిల్లా మేనేజర్ రాఘవేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీ శంకర్, డీఆర్డీవో పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అందేలా చూడాలి
ఎస్సీ వసతి గృహాల విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అందేలా సంక్షేమ అధికారులు చిత్త శుద్ధితో పని చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సోమవారం ఎస్సీ వసతి గృహ సంక్షేమ అధికారులతో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2,126 మంది ఎస్సీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, ఇందులో 882 మందికి మాత్రమే స్కాలర్షిప్ మంజూరైనట్లు చెప్పారు. మిగిలిన 1,244 మంది రిజిస్ట్రేషన్ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలి
జిల్లాలో రెండో డోస్ వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించి ప్రజారోగ్య రక్షణే ధ్యేయంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ దివాకర, డీఎంహెచ్‌వో శ్రీరామ్, సంబంధిత ప్రత్యేక అధికారులతో కలెక్టర్ వ్యాక్సినేషన్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు సబ్ సెంటర్లకు ఒక అధికారిని ఇన్చార్జిగా పెట్టి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలన్నారు. ఏఎన్ఎం, సూపర్ వైజర్లు, మెడికల్ సిబ్బంది సరిగా పని చేయకపోతే వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు. మండల ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని, ప్రతి రోజూ సాయంత్రం సెకండ్ డోస్ నివేదికలు గ్రూపులో పోస్ట్ చేయాలన్నారు. కార్యక్రమంలో డీపీవో ఆశాలత, జడ్పీ సీఈవో శోభారాణి, సీపీవో సామ్యూల్, డీఆర్డీవో పీడీ పురుషోత్తం పాల్గొన్నారు.