కాటారం, డిసెంబర్ 20: మండలంలోని వీరాపూర్ గ్రామంలో మల్లన్న బోనాలు సోమవారం వైభవంగా నిర్వహించారు. మహిళలు, భక్తులు తరలి వచ్చి స్వామి వారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామి వారి సన్నిధిలో బోనాలు వండి నైవేద్యాలు సమర్పించడంతోపాటు పట్నాలు వేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. లక్ష్మీదేవరల ఊరేగింపు, శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు, పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ రిజర్వు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెనగంటి మధూకర్ దంపతులు మల్లన్న స్వామి వారిని దర్శించుకొని మొక్కులు సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్‌రెడ్డి, ఎంపీటీసీ పొట్ల ఎల్లయ్య, నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా మల్లన్న బోనాల జాతర
మహదేవపూర్ : బెగ్లూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతర వైభవంగా సాగింది. ఒగ్గు కళాకారుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు, లక్ష్మీ దేవరల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామస్తులు ఉదయాన్నే గోదావరి స్నానాలు ఆచరించి తమ ఇళ్లలో నైవేద్యాలతో కూడిన బోనాలు పెట్టుకుంటారు. పెద్దసంఖ్యలో మహిళలు బోనాలతో మల్లన్నదేవుడి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి నైవేద్యాన్ని సమర్పించారు. పలిమెల, కాటారం, మహాముత్తారం, మల్హర్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి మల్లన్న స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు హాజరై బోనమెత్తుకుని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. టీఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు జక్కు రాకేశ్, మహదేవపూర్ ఎంపీపీ బన్సోడ రాణీబాయి, పీఏసీఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, సర్పంచ్ శ్రీపతిబాపు, పార్టీ మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్‌రావు, యూత్ మండలాధ్యక్షుడు అలీంఖాన్ పాల్గొన్నారు.