ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేయాలి
రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ శవయాత్ర, దహనం
పరకాల, డిసెంబర్ 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతుల పాలిట శాపంగా మారిందని, ఇలానే వ్యవహరిస్తే రైతులతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని బొంద పెడుతామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సీఎం కేసీఆర్ పిలుపుమేరకు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు కేంద్రం దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి బస్టాండ్ సర్కిల్లో దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు, పెట్టుబడిసాయం అందిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో తెలంగాణపై వివక్ష చూపుతోందన్నారు. పేదల సంపదను దోచి కార్పొరేట్ వ్యక్తులకు పెడుతోందని చెప్పారు. గతంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురాగా, రైతుల ఆందోళనతో దిగివచ్చిందని, ప్రధానమంత్రి మోదీ రైతులకు క్షమాపణలు చెప్పారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ర్టాలను ఒకేలా చూడాలని, కానీ తెలంగాణపై వివక్ష చూపుతోందన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుల ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్రంలో వారికి స్థానం లేదని, ప్రజలు బుద్ధి చెప్పి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి సారంగపాణి, పరకాల, నడికూడ జడ్పీటీసీలు సిలివేరు మొగిలి, కోడెపాక సుమలత, నడికూడ ఎంపీపీ మచ్చ అనసూర్య, వైస్ ఎంపీపీలు చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, కుమారస్వామి, పీఏసీఎస్ చైర్మన్లు గుండెబోయిన నాగయ్య, నల్లెల్ల లింగమూర్తి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, నడికూడ మండల అధ్యక్షుడు ధూరిశెట్టి చంద్రమౌళి, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.