బాల అదాలత్‌ను విజయవంతం చేయాలి
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు శోభారాణి
ములుగుటౌన్, డిసెంబర్20: బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు శోభారాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ అధికారిణి ఈపీ ప్రేమలత అధ్యక్షతన వివిధ సమన్వయ శాఖల జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. శోభారాణి మాట్లాడుతూ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో త్వరలో ములుగు జిల్లాలో బాల-అదాలత్ నిర్వహిస్తామని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణలో లోపాలు పరిశీస్తామని, బాలల సమస్యల సత్వర పరిష్కారానికి ఈ బాల అదాలత్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అధికారులు గ్రామ స్థాయిలో దండోరా ద్వారా ఈ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. గొత్తికోయ గూడెం అవాసాల్లో పిల్లల వివరాలు సేకరించాలని సూచించారు. అదనపు ఏఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ మాట్లాడుతూ ములుగు జిల్లా పోలీస్ శాఖ ద్వారా బాలల హక్కుల పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరించారు. సమావేశంలో బాలల సంక్షేమ సమితి సభ్యురాలు రామలీల, సహేదా బేగం, ఎస్సీ సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి, బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, 1098 చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ ప్రవీణ్, సఖీ కేంద్రం సిబ్బంది, చైల్డ్‌లైన్ సిబ్బంది పాల్గొన్నారు.