జయశంకర్ భూపాలపల్లి/ములుగు, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) :వడ్ల కొనుగోళ్లపై బీజేపీ దమననీతిని కర్షకలోకం దునుమాడింది. కేంద్రం గుండెలదిరేలా గులాబీ దండుతో కలిసి కదం తొక్కింది. ధాన్యం ఎట్ల కొనరో తేల్చుకుంటామని కన్నెర్రజేస్తూ ఊరూరా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను పాడెలపై కట్టి.. చావుడప్పులు కొడుతూ శవయాత్రలు తీసి కాట్నాలపై పెట్టి కాల్చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం టీఆర్ఎస్ నాయకులు, రైతులు చేపట్టిన ఆందోళనలు.. చేసిన నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు, అన్నదాతలు ర్యాలీలు తీసి.. రోడ్లపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ గర్జించగా రహదారులన్నీ దద్దరిల్లాయి. ఇకనైనా కేంద్రం తీరు మారకుంటే గ్రామాల్లో పెద్ద ఎత్తున సంతకాల సేకరణతోపాటు వివిధ రూపాల్లో నిరంతరం ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తామని టీఆర్ఎస్ హెచ్చరించింది.
రైతుల కోసం గులాబీ దండు కదం తొక్కింది. ఊరూరా వాడవాడన టీఆర్ఎస్ శ్రేణులు సోమవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీదిష్టిబొమ్మలతో ఊరేగింపు జరిపారు. నిరసన సెగ ఢిల్లీకి తగిలేలా రైతులతో కలిసి చావుడప్పు మోగించారు. అంతిమయాత్ర జరిపి చివరకు దిష్టిబొమ్మలకు నిప్పంటించారు. కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలని ముక్తకంఠంతో నినదించారు. వడ్లు కొనేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. మంథని నియోజకవర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆధ్వర్యంలో కాటారం, మహదేవపూర్ మండలకేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ములుగు జిల్లా కేంద్రం లో ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఏటూరునాగారంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, గోవిందరావుపేటలో మాజీ ఎంపీ సీతారాంనాయక్ రైతులతో కలిసి ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
రైతులను గోసపెడుతున్నరు;ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్వర్
ఏటూరునాగారం : ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను గోసపెడుతున్నదని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చావుడప్పు కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి బస్టాండు సెం టర్ వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డు బైఠాయించి నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం ఆంక్షలు ఎత్తివేయాలని జడ్పీ చైర్మన్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గడదాసు సునీల్‌కుమా ర్, ఎంపీపీ విజయ, వైఎస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు వలియాబీ, ఎంపీటీసీ కోట నర్సింహులు, కుమ్మరి స్వప్న, సర్పంచ్ దొడ్డ కృష్ణ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, సప్పిడిరా రాంనర్సయ్య, సర్దార్ పాషా, కాళ్ల రామకృష్ణ, మెరుగు సత్యం, అజ్మత్‌ఖాన్, కొండాయి చిన్ని, సలీం పాషా, ఖాజా పాషా, బట్టు రమేశ్, కందకట్ల శ్రీనివాస్, సిద్దబోయిన రాంబాబు, దన్నపునేని కిరణ్, మంతెన సతీశ్ పాల్గొన్నారు.
వడ్లు కొనే బాధ్యత కేంద్రానిదే;ములుగు రైతు ధర్నాలో ఎమ్మెల్సీ బండా ప్రకాశ్
కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలపై వివక్ష చూపకుండా ఆహార ధాన్యాలను కొనాలని, వడ్లు కొనే బాధ్యత సైతం కేంద్ర ప్రభుత్వానిదేనని ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ఎంపీపీ గండ్రకోట శ్రీదేవీ సుధీర్‌యాదవ్ ఆధ్వర్యంలో చావుడప్పు, రైతు ధర్నా కార్యక్రమం చేపట్టగా ఎమ్మెల్సీ హాజరై టీఆర్ఎస్ నాయకులతో కలిసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను నిలబెట్టుకునే ఆరాటంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఊరూరా చావు డప్పు కార్యక్రమం చేపట్టామన్నారు. రైతులను ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షే మ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. వీటన్నింటినీ అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్‌కుమార్, కార్యదర్శి నవీన్, రైతు బంధు సమితి మండల కో ఆర్డినటేర్ కేశెట్టి కుటుంబరావు, ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య, మాచర్ల ప్రభాకర్, పోరిక విజయ్‌రాంనాయక్, నాయకులు గోవింద్‌నాయక్, వెల్పూరి సత్యనారాయణరావు, రమేశ్‌రెడ్డి, మేర్గు సంతోష్‌యాదవ్, మల్లంపల్లి సర్పంచ్ చందకుమార్, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ భగ్గుమన్నది. అధినేత కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించింది. కేంద్రం వైఖరికి నిరసనగా అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి మరోసారి రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను తెలియజెప్పేందుకు మంత్రుల బృందంతో ఎర్రబెల్లి దయాకర్‌రావు వెళ్లారు. మంత్రి సత్యవతిరాథోడ్ మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో కాజీపేటలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్లో ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి పాల్గొన్నారు. అలాగే వరంగల్ జిల్లా రాయపర్తిలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కె.వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ హనుమకొండ జిల్లా ఐనవోలులో, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిరసన తెలిపారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నడికూడ, పరకాలలో, హనుమకొండ జడ్పీ చైర్మన్ ఎం.సుధీర్‌కుమార్ ఎల్కతుర్తిలో, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి హనుమకొండ జిల్లా శాయంపేటలో, భూపాలపల్లిలో నిరసనలో పాల్గొన్నారు. మరిపెడలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పాల్గొన్నారు. చెన్నారావుపేటలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిరసన దీక్షతో పాటు జాతీయ రహదారిపై వంటావార్పు నిర్వహించారు. ములుగు జిల్లాకేంద్రంలో ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, ఏటూరునాగారంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ నిరసనలో పాల్గొన్నారు.