పర్మిషన్ లేని భవనాల కూల్చివేతకు నిర్ణయం
టీఎస్ బీపాస్ వెరిఫికేషన్ బృందాల ఏర్పాటు
అక్రమ నిర్మాణాల గుర్తింపు పనిలో తలమునకలు
సర్కారు ఆదాయానికి గండి పడకుండా చర్యలు
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 20( నమస్తేతెలంగాణ) : జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందిన జయశంకర్ భూపాలపల్లిలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా లే అవుట్లు, ప్లాట్లు చేసి దందా కొనసాగిస్తూ సర్కారు ఆదాయానికి గండి కొడుతుండడంపై మున్సిపల్ శాఖ దృష్టి పెట్టింది. పట్టణంతో పాటు జిల్లావ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో వెలసిన అనధికార లే అవుట్లు, అనుమతులు లేకుండా చేసిన ప్లాట్లపై ఉక్కుపాదం మోపుతున్నది. కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన లే అవుట్ కమిటీ అనుమతులు లేకుండా పాట్లు విక్రయించినా, కొన్నా కఠిన చర్యలు తప్పవని, అక్రమంగా నిర్మించిన భవనాలను సైతం తొలగిస్తామని హెచ్చరిస్తున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందిన తర్వాత గృహాల నిర్మాణం గణనీయంగా పెరిగింది. గతంలో ఇక్కడ కేవలం సింగరేణి, కేటీపీపీ ఉద్యోగులే నివాసం ఉండేవారు. జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత ఇతర వ్యాపారాలు జోరందుకున్న నేపథ్యంలో ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేవా రి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలో గృహ నిర్మాణాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. జిల్లా నుంచి జాతీయ రహదారులు కూడా ఉండడంతో ఇక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చా యి. ఇండ్ల కిరాయిలు, ప్లాట్ల ధరలు పెరిగి పోయాయి. ప్రతి ఒక్కరూ స్థలాల కొనుగోలు, గృహాల నిర్మాణంపై దృష్టి పెట్టడంతో జిల్లా కేంద్రం, పరిసర గ్రామాల్లోనూ భారీగా ఇండ్ల నిర్మాణం పెరిగింది. ఈ దశలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన, చేపడుతున్న వారి పై మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సులభంగా గృహ నిర్మాణ అనుమతులు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్-బీపాస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. టీఎస్-బీపాస్‌లో ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో శాఖాపరమైన లాంఛనాలు పూర్తి చేసి అనుమతులు జారీ చేస్తున్నారు.
నాలుగు కమిటీల పర్యవేక్షణ..
మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న కొత్త గృహాల నిర్మాణాలు, అనుమతులు, ప్లాట్ల లే అవుట్ విధానాల పర్యవేక్షణ కోసం కలెక్టర్ నాలుగు కమిటీలు ఏర్పాటు చేసి, గృహాల నిర్మాణాలు, మున్సిపల్ యాక్ట్ ప్రకారం జారీ అయిన ఇండ్ల అనుమతులను పర్యవేక్షిస్తున్నారు. ఇందులో టీఎస్ బీపాస్ పోస్ట్ వెరిఫికేషన్ కమిటీ, టా స్క్ ఫోర్స్ కమిటీ, లే అవుట్ కమిటీ, ఎల్ఆర్ఎస్ కమిటీలు ఉన్నాయి. వీటి ఆధ్వర్యంలో పరిశీలనకు వచ్చిన అక్రమ ఇండ్ల నిర్మాణాలు, అనధికార లే అవుట్లపై టా స్క్ ఫోర్స్ బృందాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. టీ ఎస్ బీపాస్ అనుమతుల మేరకు కాకుండా ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మున్సిపాలిటీ అనుమతులు పొందిన ప్రకారం కాకుండా ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలపై విధించిన అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే భవనాలను ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా సీజ్ చేయడమో కూల్చి వేయడమో చేపడుతామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
ఎలాంటి అనుమతులు పొందకుండా వందల సంఖ్యలో ఇండ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మున్సిపాలిటీ అధికారులు గుర్తించారు. మున్సిపాలిటీ పరిధిలో 150 ఇండ్లకు టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేయగా 100 వరకు అనుమతులు మంజూరయ్యాయి. మరో 50 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. అనుమతులు పొందిన వారు సైతం అనుమతులకు మించి ఫ్లోర్ల నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి వాటితో పాటు అనుమతులు పొందకుండా ప్లాట్లు విక్రయిస్తున్న వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ఫీజులు రూ.లక్షల్లో ఎగ్గొట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు సమాచారం. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని 170, 186, 319 సర్వే నంబర్లలో చేపడుతున్న పలు ఇండ్లకు అనుమతులు లేవని తెలిసింది. కనీసం 120 గజాల స్థలంలో కొత్త గృహం కట్టాలంటే సుమారు రూ.30వేల నుంచి రూ.40వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాంటిది 200 గజాల నుంచి 1000 గజాల వరకు ఇండ్ల నిర్మాణాలను అక్రమంగా నిర్మించడంతో ప్రభుత్వానికి రూ.లక్షల్లో ఆదాయం రాకుండా పోతున్నదని గుర్తించిన అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు.