భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
కోర్టుల కొత్త భవనం ప్రారంభం
భద్రకాళి, వేయి స్తంభాలగుడిలో పూజలు
ఓరుగల్లులో సరికొత్తగా సీజేఐ పర్యటన
వరంగల్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అని చెప్పిన కాళోజీ స్ఫూర్తితో తెలుగులో మాట్లాడేందుకు సాహసిస్తున్నానంటూ ప్రసంగం మొదలుపెట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ.. సాంస్కృతిక, చారిత్రక, సాహిత్య వైభవాన్ని, పోరాటాల చరిత్ర, యోధులు.. ఇలా ఓరుగల్లు గొప్పదనాన్ని ఒక్కో మాటతో వివరంగా చెప్పారు. ‘అనేక మంది కవులు, పోరాటయోధులు, విప్లవకారులను కన్న నేల ఇది. దేశానికి ప్రధానమంత్రిని ప్రసాదించిన ప్రాంతమిది. పోరుగల్లుకు, ఓరుగల్లుకు, వరంగల్‌కు వందనం’ అని ప్రస్తుతించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన వరంగల్ జిల్లా కోర్టు భవనాల సముదాయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి.. ఈ ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చివరగా వరంగల్ ప్రజలకు సామాజిక స్పృహ ఎక్కువ. హక్కుల కోసం, ప్రజలను చైతన్యపరిచేందుకు న్యాయవాదులు కృషిచేయాలి’ అని సూచించారు.
భారతదేశ న్యాయ వ్యవస్థ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన జస్టిస్ ఎన్వీ రమణ వరంగల్ పర్యటన సరికొత్తగా సాగింది. వరంగల్ గొప్పదనాన్ని ఒక్కొక్క మాటతో వివరంగా చెప్పారు. వరంగల్ సాంస్కృతిక సంపదను, సాహిత్యాన్ని, పోరాటాలను, పోరాట యోధులను గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొత్తగా నిర్మించిన వరంగల్ కోర్టుల భవనాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మతో కలిసి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆదివారం ప్రారంభించారు. అనంతరం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రసంగంలో ఎక్కువ సేపు వరంగల్ వైభవాన్ని విశదీకరించారు.
‘వరంగల్ ఒక చారిత్రక నగరం. రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో రాష్ట్రంలో ప్రముఖ స్థానంలో ఉంది. ప్రగతిశీల ఉద్యమాలకు నెలవు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం నుంచి జాతీయ కాంగ్రెస్ ఉద్యమం… మితవాద, మతవాద ఉద్యమాలకు, అనేక రాజకీయ ఉద్యమాలకు పుట్టినిళ్లు. పోరాటాల గడ్డ వరంగల్. కళలు, సంస్కృతి, సాహిత్యానికి నెలవైన ప్రాంతం. అనేకమంది కవులు, పోరాటయోధులు, విప్లవకారులను కన్న నేల ఇది. బమ్మెర పోతన, పాల్కురికి సోమన, దాశరథి, కాళోజీ వంటి సరస్వతీ పుత్రులకు జన్మనిచ్చిన భూమి ఇది. దేశానికి ప్రధానమంత్రిని ప్రసాదించిన ప్రాంతమిది. నిరంకుశ, నియంతృత్వ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా సాగిన అనేక పోరాటాలకు పుట్టినిళ్లు ఇది’ అంటూ వరంగల్ గొప్పదనాన్ని వివరించారు. ‘వరంగల్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. వరంగల్‌లో దాదాపు మూడు సాహిత్య పాఠశాలలకు హాజరయ్యాను. ఆర్ఈసీలో జరిగిన విద్యార్థి ఉద్యమాల సాహిత్య పాఠశాలకు వచ్చాను. ఇక్కడ నాకు బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. వరంగల్‌తో నాకు అవినాభావ, ఆత్మీయ సంబంధం ఉంది’ అని చెప్పారు.
వేదిక దిగి సన్మానం..
వరంగల్ కోర్టుల కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఏడుగురు సీనియర్ న్యాయవాదులను సన్మానించాలని జిల్లా న్యాయస్థాన ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే, వరంగల్ కోర్టులో మొదటి మహిళా న్యాయవాదిగా పనిచేసిన జయహరిహరరావు(76) వేదికపైకి రాలేకపోయారు. ఇతర సీనియర్ న్యాయవాదులను సన్మానించిన అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ కిందికి దిగొచ్చి జయహరిహరరావును సన్మానించారు. న్యాయవాదులను, అధికారులను, కోర్టు సిబ్బందిని అందరినీ ఓపికగా పిలిచి మాట్లాడారు. వర్చువల్ పద్ధతిలో అన్నపూర్ణ క్యాంటీన్, జస్ట్ ఈజ్ వెబ్సైట్, రికార్డు వెబ్సైట్లను ప్రారంభించారు.
ఓ నిజాం పిశాచమాకానరాడు నిన్న పోలిన రాజు మాకెన్నడేనితీగలను తెంపి అగ్నిలోకి దింపినావునా తెలంగాణ కోటి రతనాల వీణదాశరథి గర్జన, పరపీడన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటాలకు ఊపిరి నిచ్చిందని జస్టిస్ రమణ ప్రసంగంలో అన్నారు.
దేశభక్తుల కోర్టు..
వరంగల్ కోర్టు గురించి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పిన అంశాలు న్యాయవాదులను ఆలోచింపజేశాయి. ‘తెలంగాణలోని 12మంది న్యాయమూర్తులు, కుటుంబసభ్యులతో కలిసి రెండురోజులు ఇక్కడ పర్యటించే అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. రామప్ప అద్భుత క్షేత్రం, ప్రపంచ ప్రఖ్యాత దివ్యక్షేత్రం. మనకు ఉన్న గొప్ప చారిత్రక సంపదను యునెస్కో గుర్తించింది. వేయి స్తంభాల గుడి అద్భుత కళా వైభవం. భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. కోటలకు, అద్భుత కట్టడాలను అందించిన కాకతీయుల ఘనమైన వారసత్వానికి దీటుగా కోర్టు భవనాలు తీర్చిదిద్దబడ్డాయి. 1936లో నిర్మించిన ఈ కోర్టు అనేక పురాతన కట్టడాలకు నెలవుగా ఉంది. కొన్నేండ్లుగా ఎంతో కృషితో అద్భుత కట్టడం పూర్తి చేసుకున్నాం. ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, దేశభక్తులతో ఈ కోర్టు ప్రాంగణం పునీతమైంది. ఈ ప్రాంతం నుంచే జస్టిస్ జగన్మోహన్రెడ్డి, జస్టిస్ రఘువీర్, జస్టిస్ మోతీలాల్‌నాయక్, జస్టిస్ నర్సింహారెడ్డి, జస్టిస్ కేశవరావు వంటి వారు న్యాయమూర్తులుగా వచ్చారు. జస్టిస్ నవీన్‌రావు ఈ ప్రాంతంలో కోర్టుల పునర్నిర్మాణాన్ని మానసపుత్రికగా తీర్చిదిద్దారు.
నవీన్‌రావు గురించి ఎక్కువగా చెబితే దిష్టి తగిలే ప్రమాదం ఉంది. వరంగల్ ప్రజలకు సామాజిక స్పృహ ఎక్కువ. హక్కుల కోసం, ప్రజలను చైతన్యపరిచేందుకు న్యాయవాదులు కృషిచేయాలి’ అని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్వల్ భుయాన్, జస్టిస్ ఏ రాజశేఖరరెడ్డి, జస్టిస్ పీ నవీన్‌రావు, వరంగల్ కోర్టుల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి నందికొండ నర్సింగరావు, వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేపీ ఈశ్వరనాథ్, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ సీ సంజీవరావు, డీ జనార్దన్, బీ జయాకర్, గవర్నమెంట్ ప్లీడర్ తక్కళ్లపల్లి శ్యాంసుందర్‌రావు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, గ్రేటర్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్య హాజరయ్యారు.