పర్మిషన్ లేకుండా అదనపు ఫ్లోర్లు నిర్మించొద్దు
21 రోజుల్లో ఇండ్ల నిర్మాణానికి అనుమతులివ్వాలి
అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో అనుమతులు తీసుకోకుండా అక్రమ కట్టడాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. బుధవారం భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో టీఎస్ బీపాస్ పోస్ట్ వెరిఫికేషన్ కమిటీ, టాస్క్‌ఫోర్స్ కమిటీ, లే అవుట్ కమిటీ, ఎల్ఆర్ఎస్ కమిటీలతో అడిషనల్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన 21 రోజుల్లోనే ఇంటి నిర్మాణానికి మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇవ్వాలని ఆదేశించారు. కొంత మంది స్వీయ ధ్రువీకరణ ద్వారా ఇంటి నిర్మాణం పర్మిషన్ తీసుకుని ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అదనపు ఫ్లోర్లు నిర్మిస్తున్నారని, ఆ భవనాలను తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం సీజ్ చేయాలని లేదా పూర్తిగా కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమ కట్టడాలు నిర్మిస్తే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా టాస్క్‌ఫోర్స్ టీంతో ఆ భవనాలను కూల్చివేస్తామన్నారు. అవసరమైతే రిజిస్ట్రేషన్ వాల్యూపైన 25 రేట్ల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించారు. అంతేకాకుండా రోడ్లను ఆక్రమించి ఇండ్ల నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవన్నారు. జీవో 105 ప్రకారం జిల్లా కలెక్టర్ అధ్యక్షత ఏర్పాటు చేసిన లే-అవుట్ కమిటీ ద్వారా లే అవుట్ అనుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. అనుమతులు లేని లే అవుట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుని వాటిని ప్రోహిబిటరీ లిస్ట్‌లో చేర్చి, భవిష్యత్‌లో రిజిస్ట్రేషన్లు కాకుండా చేస్తామని హెచ్చరించారు. టాస్క్ ఫోర్స్ టీం అధికారులు అక్రమ కట్టడాలు, లే అవుట్లపై తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. సమీక్షలో మున్సిపల్ కమిషనర్, డీఆర్డీవో, పంచాయతీరాజ్, ఇరిగేషన్, పోలీస్, ఫైర్ స్టేషన్, జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారులు, టౌన్‌ప్లానింగ్ సూపర్ వైజర్లు పాల్గొన్నారు.