వరి రైతుకు మద్దతుగా గులాబీ దండు
మహాధర్నాకు తరలిపోనున్న
జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు
కేంద్ర ప్రభుత్వం ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్
జయశంకర్ జిల్లా నుంచి ఎమ్మెల్యే గండ్ర, ములుగు నుంచి జడ్పీచైర్మన్ జగదీశ్
మొత్తం వడ్లు, బియ్యం కొనాల్సిందే : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
కేంద్రం వైఖరికి నిరసనగా నేడు ‘చలో ఇందిరాపార్క్’
జయశంకర్ భూపాలపల్లి/ ములుగు, నవంబర్17 (నమస్తే తెలంగాణ) : అన్నదాత కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చడమే కాదు.. ఆ రైతుకు కష్టమొచ్చినప్పుడు ఆదుకోవడంలోనూ టీఆర్ఎస్ సర్కారు ముందుంటున్నది. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆగమవుతున్న అన్నదాతకు అండగా నిలిచి, కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కదంతొక్కేందుకు సిద్ధమైంది. వరి రైతు ఆందోళనపడొద్దని.. కేంద్రం మెడలు వంచైనా న్యాయం చేస్తామని భరోసానిస్తున్నది. ఈమేరకు సీఎం కేసీఆర్ పిలుపునందుకొని నేడు(గురువారం) హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన మహాధర్నాకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు ల్లాల నుంచి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, ఆయా మండలాల టీఆర్ఎస్ ముఖ్య నాయకులు తరలివెళ్లనున్నారు. వానకాలం వడ్లు పూర్తిస్థాయిలో కొనాలని, పంజాబ్ తరహాలో ఇక్కడ కూడా ఆంక్షలు లేకుండా ధాన్యం సేకరించాలనే డిమాండ్‌తో కేంద్రం తీరును ఎండగట్టనున్నది.
వరి రైతుకు అండగా మేమున్నామంటూ గులాబీ సైన్యం మద్దతుగా నిలిచింది. ప్రస్తు తం ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరి రైతులకు శాపంగా మారిన తరుణంలో మరో ఉద్యమానికి సిద్ధమైంది. వరి రైతు ఆందోళనపడొద్దు.. కేంద్రం మెడలు వంచైనా న్యాయం చేస్తామని భరోసానిస్తూ బీజేపీ సర్కారుపై పోరుకు సిద్ధమైంది. వానకాలం వడ్లను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేలా ఎఫ్‌సీఐని ఆదేశించాలని, పంజాబ్ తరహాలో తెలంగాణ రైతుల నుంచి ఇబ్బందుల్లేకుండా పంటలు కొనేలా శాశ్వత చర్యలు తీసుకోవాలనే టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా వరి రైతుకు న్యాయం చేయాలనే లక్ష్యంతో గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా తలపెట్టింది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించే ఈ ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు ఈ ధర్నాలో పాల్గొననుండగా, వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్‌తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు ధర్నాలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వెళ్లారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేలా ఈ ధర్నా సాగనున్నది. పంట కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రాస్తారోకో, ధర్నాలతో నిరసనలు జరిగినా కేంద్ర వైఖరిలో మార్పు లేకపోవడంపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. రైతుల ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వానికి మరోసారి చాటి చెప్పేందుకు ఇందిరా పార్కు వద్ద ధర్నా చేయాలని పిలుపునిచ్చారు. ఈమేరకు జిల్లాలోని ముఖ్యమైన ప్రజాప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లారు.
రైతన్న కోసం..
అన్నదాతలకు టీఆర్ఎస్ మరోసారి అండగా నిలుస్తోంది. తెలంగాణలో ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసే వరి పంట కొనుగోలుపై కేంద్రం ఆంక్షలు పెట్టింది. రెండేండ్లుగా ఈ ఆంక్షలను ఇంకా పెంచుతూ పోతోంది. నిరంతర ఉచిత విద్యుత్, ప్రతి ఎకరాకు సాగునీరు, రైతుబంధు పథకం కింద పెట్టుబడి వంటి రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం అమాంతం పెరిగిం ది. నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. పండిన పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్ల నుంచి వచ్చే బియ్యాన్ని సేకరించాల్సిన కేంద్రం ఈ పక్రియ నుంచి వైదొలుగుతోంది. ఈ తరుణంలో కేంద్రం అవలంబిస్తున్న వైఖరితో రాష్ట్రంలో పండిన మొత్తం పంటను కొనే పరిస్థితి లేకుండాపోతోంది. వానకాలం పంటను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొంటుందో లేదో తెలియని పరిస్థితి నెలకొం ది. యాసంగి సీజన్లో వచ్చే వరి పంటకు సంబంధించిన బియ్యాన్ని సేకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో రాష్ట్రంలో వరి సాగుచేసే రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వరి రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో కేంద్రానికి తెలియజెప్పేలా టీఆర్ఎస్ ధర్నా చేపట్టింది.
ధర్నాను విజయవంతం చేయాలి