30శాతం ఫిట్మెంట్ వరమైంది
కొత్త జోనల్ వ్యవస్థతో 95 శాతం మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు
ఉదారత కలిగిన నాయకుడు సీఎం కేసీఆర్
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర
కృష్ణకాలనీ, ఆగస్టు 13 : సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం ఫిట్మెంట్తో రాష్ట్రంలోని తొమ్మిది లక్షలకు పైగా ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ నాన్ గెజిటేడ్ ఆఫీసర్స్ సంఘం భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టీఎన్జీఓఎస్ భవనాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగులపై ఉదారత కలిగిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. వారు ఆశించిన దానికంటే ఎక్కువగా ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కొత్త జోనల్ వ్యవస్థతో 95 శాతం స్థానిక నిరుద్యోగులకే ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. భూపాలపల్లి అన్ని రకాల సౌకర్యాలున్న జిల్లా అయినప్పటికీ ఉద్యోగులు ఇక్కడికి రావాలంటే భయపడేవారన్నారు. నేడు జిల్లాలో పంటలు బాగా పండుతూ, టూరిజం, అన్ని సౌకర్యాలతో మానవ సంపద అభివృద్ధి చెందుతుండడంతో గతంలో భయపడిన ఉద్యోగులే నేడు సంతోషంగా జిల్లాకు వస్తున్నారన్నారు. గతంలో కొంత మంది ఉద్యోగులు జిల్లాలో పొల్యూషన్, అతివేడి ఉందని, తమకు అదనంగా అలవెన్స్ కావాలని కోరారని, త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీఎన్జీవోస్ భవనానికి తన వంతు సహకారం అందిస్తానని, జిల్లా యంత్రాంగం కూడా సహకరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్, మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, ఎంపీపీ మందల లావణ్య, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు బూరుగు రవి, కార్యదర్శి హరికృష్ణ, ఆయా వార్డుల కౌన్సిలర్లు, టీఎన్జీవోస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.