హనుమకొండ చౌరస్తా : క్రీడలు యువతలో పోరాట పటిమను ( Fighting spirit ) పెంపొందిస్తాయని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ (Dasyam Vinaybhaskar) అన్నారు. కాకతీయ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కేసీఆర్ క్రికెట్ కప్ 2026 -8వ సీజన్ గురువారం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వినయ్‌భాస్కర్ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం బౌలింగ్, బ్యాటింగ్ చేసి టోర్నమెంట్స్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట సాధనలో కేసీఆర్ పాత్ర అపూర్వమని కొనియాడారు.
క్రీడలు యువతకు క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు నేర్పుతాయని, గ్రామీణ, కిందిస్థాయిలో ఉన్న ప్రతిభావంతులైన యువక్రీడాకారులను వెలికితీసి వారికి వేదిక కల్పించాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్రెడ్డి, నిర్వాహకులు షాకీర్, అస్లాం, వీరు, సిరాజ్, రాజేష్, రాంబాబు, కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్లు, క్రీడాసంఘాల ప్రతినిధులు, యువకులు, విద్యార్థులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.