యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 12 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో తమ తాజా మూవీ ‘యుఫోరియా’ మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తుందని ప్రముఖ సినీ దర్శకుడు గుణశేఖర్ అన్నారు. గురువారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట ఆలయం అత్యద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. స్వామి వారు మహా మహిమాన్వితమైనటువంటి శక్తి గల దేవుడు అని, ఆయన దయతో ప్రతి ఒక్కరూ బాగుండాలని ఆకాంక్షించారు. తాను తరచుగా యాదగిరిగుట్టకు వస్తుంటానని తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో తమ సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నట్లు చెప్పారు. వీలైతే భవిష్యత్‌లో యాదగిరిగుట్ట స్వామి వారిపై మంచి స్క్రిప్ట్ తయారు చేసి సినిమా తీసే ఆలోచనను చేస్తామని తెలిపారు.
కాగా తమ లేటెస్ట్ మూవీ యుఫోరియా మంచి విజయం సాధించిందని అన్నారు. పేరెంటింగ్ పైన తీసినటువంటి ఈ సినిమా అందరి ఆదరణను చూరగొంటుందని తెలిపారు. తమ సినిమా మరింత పెద్ద ఎత్తున విజయం సాధించాలని కోరుతూ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని వేడుకున్నామని తెలిపారు. ఈ మూవీని అన్ని వర్గాల వారు థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు. ఈ సినిమా కేవలం థియేటర్లలో మాత్రమే చూడడానికే తీశామని తెలిపారు. ఓటిటి కోసం ఎదురు చూడవద్దని ప్రతి ఒక్కరూ థియేటర్ కు వచ్చి తమ మూవీని చూసి ఆదరించాలని కోరారు. ప్రతి ఒక్కరు థియేటర్‌కు వచ్చి ఈ సినిమా చూస్తే ఇందులో ఉన్న మంచి కంటెంట్ ఏమిటి అన్నది తెలుస్తుందన్నారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమాకు అంతటా విశేష స్పందన లభిస్తుందని, నేటి సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలను ప్రస్తావిస్తూ ఈ సినిమా తీసినట్లు తెలిపారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రస్తుత పరిస్థితులపై తీసిన ఈ మూవీలో మంచి భావోద్వేగాలు ఉన్నాయని, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు తమ సినిమాకు కనెక్ట్ కావడం ఖాయమని అన్నారు. ఆయన వెంట యుఫోరియా మూవీ హీరో విగ్నేష్ గవిరెడ్డి, లూరా ఫిలిమ్స్ సభ్యులు, షార్ట్ ఫిలిం డైరెక్టర్ శ్రేయస్, సినిమా యూనిట్ సభ్యులు ఉన్నారు.