– అర్ధరాత్రి సంగమేశ్వర స్వామికి తొలి పూజ
– వివిధ జిల్లాల నుండి లక్షలాది భక్తులు వచ్చే అవకాశం
– ఏర్పాట్లు పూర్తి చేసిన రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 12 : ఖమ్మం జిల్లాలోనే సుప్రసిద్ధ శివాలయం అయిన తీర్థాల సంగమేశ్వర స్వామి జాతర మహోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు కొనసాగుతాయని దేవాలయం ఈఓ వేణుగోపాలాచారి తెలిపారు. ఇప్పటికే ఖమ్మం ఆర్డీఓ జి.నర్సింహారావు అధ్యక్షతన వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, పోలీస్, ఆర్టీసీ, రెవెన్యూ, మత్స్యశాఖ, మహిళా సంక్షేమ శాఖ తదితర అధికారులతో రెండు దఫాలుగా సమీక్ష జరిగిందన్నారు. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ నుండి సైతం వేలాది మంది భక్తులు మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా తీర్థాలకు వచ్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఖమ్మం రూరల్ తాసీల్దార్ నిరంతరం దేవాలయ ఈఓ తో కలిసి పర్యవేక్షణ చేస్తున్నారు. ట్రాఫిక్ ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు గాను ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ ముష్కారాజ్ రూట్ మ్యాప్ లను తయారుచేసి సిబ్బందికి అవగాహన కల్పించారు. భక్తులకు అవసరమైన స్నాన ఘట్టాలు, నీటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్లు దేవాలయం సిబ్బంది తెలిపారు. 14వ తేదీ అర్ధరాత్రి తొలి పూజ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు స్వామివారి కల్యాణం మహోత్సవ ఘట్టం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.

ఈ 14 నుండి తీర్థాల సంగమేశ్వర స్వామి జాతర