తిరువనంతపురం: కేరళ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటతిల్(MLA Rahul Mamkootathil) కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేప్, అబార్షన్ కేసులో ఇప్పటికే ఆ ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్ మంజూరీ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే రాహుల్, బాధితురాలి మధ్య ఉన్న రిలేషన్ సమ్మతి ప్రకారం కొనసాగినట్లు కోర్టు పేర్కొన్నది. తొలుత ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొని, ఆ తర్వాత రిలేషన్ దెబ్బతింటే, అలాంటి కేసుల్లో శృంగారాన్ని అత్యాచారంగా భావించలేమని జడ్జి కౌసర్ ఎడప్పగాత్ తెలిపారు. ఇద్దరు వయోజనులు స్వచ్ఛందంగా సమ్మతితో శృంగారంలో పాల్గొని, అలా వాళ్లు కొన్నాళ్లూ ఆ రిలేషన్‌ను కొనసాగితే, అప్పుడు అది ఇష్టపూర్వకమైన చర్య అవుతుందని, కానీ ఆ అంశాన్ని భాగస్వామిపై లైంగిక దాడిగా చూడలేమని జడ్జి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా ఆ జడ్జి గుర్తు చేశారు. ఇష్టపూర్వకంగా ఏర్పడిన బంధానికి బ్రేకప్ చెబితే, అలాంటి రిలేషన్లో నేరపూరిత రేప్ చట్టాలను ప్రయోగించలేమని సుప్రీంకోర్టు గతంలో పేర్కొన్న విషయాన్ని జడ్జి వెల్లడించారు. బంధం బలహీనపడినంత మాత్రాన, దాన్ని రేప్‌గా చిత్రీకరించలేమని, అలాంటి చర్యలను ఖండిస్తున్నట్లు సుప్రీం పేర్కొన్నదని తన ఆదేశాల్లో జడ్జీ చెప్పారు. ఎమ్మెల్యే రాహుల్, బాధితురాలి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ అంశాలను కోర్టు బయటపెట్టింది. బాధితురాలి సమ్మతితోనే అబార్షన్ జరిగినట్లు చాట్ ద్వారా తెలిసినట్లు కోర్టు చెప్పింది. అబార్షన్ కోసం ట్యాబ్లెట్లను బాధితురాలే అడిగిందని, ఆమె తన లొకేషన్ కూడా షేర్ చేసిందని, ఎమ్మెల్యే స్నేహితుడి నుంచి మెడిసిన్ కూడా అందుకున్నట్లు వాట్సాప్ ఛాటింగ్‌లో ఉన్నట్లు కోర్టు పేర్కొన్నది.