ఈ నెల 16 నుంచి రూ.50వేలలోపు రుణాల మాఫీ
మంత్రి సత్యవతిరాథోడ్
కేసముద్రంలో డీసీసీబీ బ్రాంచ్ ప్రారంభం
రైతులు, మహిళలకు రూ.7.25 కోట్ల రుణాల పంపిణీ
కేసముద్రం, ఆగస్టు 12 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. గురువారం ఆమె మండల కేంద్రంలో డీసీసీబీ బ్రాంచ్‌ను ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమైక్య పాలనలో సాగు నీరు, కరంట్ కోసం గోసపడిన తెలంగాణ స్వరాష్ట్రంలో సగర్వంగా తలెత్తుకొని నిలబడిందన్నారు. సీఎం కేసీఆర్ పట్టుదలతో అన్ని సమస్యలను పరిష్కరిస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల కరంటు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి పథకాలతో పేదలకు కొండంత అండగా ఉంటున్నట్ల తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబీమా, 24 గంటల కరంటు ఎందుకు ఇవ్వడంలేదో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోరైతులు రెండు పంటలను పండిస్తూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారని అన్నారు. ఇప్పటికే రూ.25వేల వరకు రుణమాఫీ చేయగా, ఈ నెల16 నుంచి రూ. 50వేలలోపు రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదన్నారు. డీసీసీబీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. వ్యవసాయంతోపాటు చిన్న చిన్న అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రైతులు ఆర్థికంగా బలోపేతమవుతున్నారని, వారి బ్యాంకు ఖాతాల్లో రూ.రెండు, రూ.మూడు లక్షలు నిల్వఉండే స్థాయికి వచ్చారన్నారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు మాట్లాడుతూ.. కేసముద్రంలో నూతనంగా డీసీసీబీ బ్రాంచ్ ఏర్పాటు చేసి రైతులు, మహిళా సంఘాలకు రూ.7.25 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. డీసీసీబీ ద్వారా రైతుల పిల్లల విదేశీ విద్య, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, నాటు యంత్రాలు, కోళ్లు, గేదెల పెంపకానికి రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు 0.05 శాతం వడ్డీ ఇన్సెంటివ్ అందిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో పంటరుణాల కోసం నెలల తరబడి రైతులు సహకార సంఘాల చుట్టూ తిరిగే వారని, ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోనే రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు, ఎంపీపీ ఓలం చంద్రమోహన్, మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ్‌రావు, డీసీసీబీ డైరెక్టర్ రంజిత్‌కుమార్, సింగిల్ విండో చైర్మన్ దీకొండ వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు యాకూబ్‌రెడ్డి, నజీర్అహ్మద్, శ్రీనివాస్, మహేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వీరూనాయక్, అధికారులు పాల్గొన్నారు.