జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): ఆదినుంచీ అన్నదాతలకు అండగా ఉంటున్న టీఆర్ఎస్ సర్కారు, నేడు రైతుల కోసం కదం తొక్కేందుకు సిద్ధమైంది. యాసంగి వడ్లు కొనబోమని తేల్చి చెప్పిన కేంద్రం తీరును ఎండగట్టేందుకు నడుం బిగించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలిపేందుకు గులాబీ దండు రెడీ అయింది. తమకు బీజేపీ సర్కారు చేస్తున్న అన్యాయంపై గళమెత్తేందుకు కర్షకలోకం కదిలిరానుంది. ధర్నాలపై జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయడంతోపాటు ఎన్నికల కోడ్, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ల అనుమతి కోసం వినతిపత్రాలు ఇచ్చారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగే ధర్నాల్లో పాల్గొనేందుకు ప్రతి ఊరి నుంచీ నాయకులు, కార్యకర్తలు, రైతులు నియోజకవర్గకేంద్రాలకు చేరుకోనున్నారు.
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతు సంఘీభావ ధర్నా జరగనుంది. రాష్ట్రంలో రైతులకు అండగా నిలువాలని, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేంత వరకు ఉద్యమిస్తామని సీఎం కేసీఆర్ పిలుపుమేరకు నేడు జిల్లా కేంద్రంలో ఈ ధర్నా చేపట్టనున్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతుల తరఫున సీఎం కేసీఆర్ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో 12వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు శాంతియుత వాతావరణంలో ధర్నా చేయనున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పార్టీ తరఫున కలెక్టర్ నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసి, అనుమతి వచ్చిన తర్వాత భారీగా ధర్నా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తరలిరానున్న రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని, రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని మొత్తాన్ని షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ పారీ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేయనున్న ధర్నాకు జిల్లాలోని అన్ని మండలాల రైతులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కదలి రానున్నారు
ధర్నాలో పాల్గ్గొననున్న ఎమ్మెల్యే గండ్ర
టీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న రైతు సంఘీభావ ధర్నాలో భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి హాజరుకానున్నారు. పార్టీకి చెందిన గ్రామ, మండల, జిల్లా స్థ్దాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నందున, కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ధర్నా విజయవంతం చేయనున్నారు.