కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శం
నడ్డా అడ్డగోలుగా మాట్లాడితే నడ్డి విరుగుతుంది
ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్
మహబూబాబాద్, జనవరి 11 : జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం రైతుబంధు సంబురాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులకు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రైజ్‌లు అందజేశారు. జిల్లా కేంద్రంలోని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ, నాలుగవ, ఐదవ బహుమతులతోపాటు మెమోంటోలను ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అందించారు. తాళ్లపూసపల్లిలోని దుర్గా భవానీ నిర్వాహకులు ఎల్ల చంద్రయ్య కోలాటం బృందం అక్కడి వారందరినీ అలరించింది. అనంతరం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రైతుబంధు సంబారాలకు ముఖ్య అతిధిగా హాజరై రైతుబంధు సంబరాల సందర్భంగా బారీ కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నవ శకం ఆవిర్భవించడంతో చూసి కేంద్ర ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నడ్డా తెలంగాణ ప్రభుత్వంపై అడ్డగోలుగా విమర్శలు చేస్తే ఇక్కడి ప్రజలు రాజకీయంగా బీజేపీ నడ్డి విరుగ్గొడతారని హెచ్చరించారు. దేశానికే అన్నం పెట్టే రైతన్నలను మోసం చేసిన ప్రభుత్వాలు ఎప్పటికీ మనగలగలేవని సూచించారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉమాపిచ్చిరెడ్డి మాట్లాడుతూ గంజీ, గట్కా తాగిన తెలంగాణ ప్రజలు నేడు వరి ధాన్యం పండించడంతో పాటు దేశానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ ఉందంటే అందుకు సీఎం కేసీఆర్‌యే కారణమని తెలిపారు. లక్కీ లాటరీలో ఎల్లిన రైతులు పండుగ కంటే ఎక్కువ సంతోషంతో పంటను సేద్యం చేసుకునే వారని తెలిపారు.
నేడు తెలంగాణ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేకపోవడంతో పాటు పంట సాగు కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు పథకం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. అనంతరం మహబూబాబాద్ మండలంలోని ఉత్తమ రైతులను ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉమాపిచ్చిరెడ్డి సన్మానించారు. అయ్యప్పస్వామి ఆలయంలో ప్రధానార్చకులు సంజీవ నంబూద్రిచే ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి శబరిమలై వెళ్లేందుకు అయ్యప్పస్వామి ఇరుముడిని స్వీకరించారు. ఎంపీపీ భూక్య మౌనిక, జడ్పీటీసీ లూనావత్ ప్రియాంక, మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ సుధగాని మురళీ, కేసముద్రం మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు, మాజీ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఊకంటి యాకూబ్‌రెడ్డి, కేసముద్రం ఎంపీపీ ఓలం చంద్రమౌళి, మహబూబాబాద్ టీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్‌రెడ్డి, మహబూబాబాద్ రైతు కో-ఆర్డినేటర్ తేళ్ల శ్రీనివాస్, మార్నేని వెంకన్న, రఘు, వార్డు కౌన్సిలర్ ఎడ్ల వేణుమాధవ్, యాస వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.