పాలకుర్తి నియోజకవర్గంలో ఐదేళ్లలో ‘రైతుబంధు’తో 74,193 మంది రైతులకు లబ్ధి
ఇప్పటి వరకు రూ.721 కోట ్ల67లక్షల సాయం
రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడి
తొర్రూరు/పాలకుర్తి రూరల్, జనవరి 11 : కరువుతో అల్లాడిన పాలకుర్తి నియోజకవర్గాన్ని దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సస్యశ్యామలం చేసి సాగు సంబురాన్ని తెచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. నియోజకవర్గంలో రైతుబంధు పథకం కింద అందిన ప్రభుత్వ సాయం వివరాలపై మంగళవారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వ్యవసాయాన్ని పండుగగా మార్చారని తెలిపారు. రైతును రాజు చేయాలని సంకల్పించి రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఈ పథకం ప్రారంభమైన 2018 సంవత్సరం నుంచి ఇప్పటివరకు పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో 74,193 మంది రైతులకు రూ.721.67 కోట్ల ఆర్థికసాయం అందజేసినట్లు తెలిపారు. పాలకుర్తి మండలంలో 18,422 మంది రైతులకు రూ.186.7కోట్లు, దేవరుప్పుల మండలంలో 14,570 మంది రైతులకు రూ.147.12కోట్లు, కొడకండ్ల మండలంలో 7,733 మంది రైతులకు రూ.77.62కోట్లు, తొర్రూరు మండలంలో 11,687 రైతులకు రూ.112కోట్లు, పెద్దవంగర మండలంలో 6,481 మంది రైతులకు రూ.62కోట్లు, రాయపర్తి మండలంలోని 15,301 మంది రైతులకు రూ.138 కోట్ల రైతుబంధు ఆర్థికసాయం అందజేశామని వివరించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 65లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన మొత్తం రూ.50వేల కోట్లకు చేరడం గొప్ప విషయమని కొనియాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఏడున్నరేళ్లలో రూ.2.7లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రైతులు రాష్ట్రవ్యాప్తంగా రైతు బంధు సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.