మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు
పరామర్శించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
పోచమ్మమైదాన్, జనవరి 11: వరంగల్ డాక్టర్ కాలనీ-2 ఎస్సారెస్పీ కెనాల్లో ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను ఎట్టకేలకు మంగళవారం గుర్తించారు. మూడు రోజుల క్రితం కొత్తవాడకు చెందిన గజ్జల సురేశ్-సంధ్య దంపతుల కుమారుడు ఆకాశ్, దాసరి రమేశ్-భవాని దంపతుల కుమారుడు హర్షవర్ధన్ కెనాల్లో గల్లంతైన విషయం తెలిసిందే. మూడు రోజుల నుంచి గాలిస్తున్న డీఆర్ఎఫ్ టీం సభ్యులు ఆరెపల్లి-కొత్తపేట మధ్య ఉన్న కెనాల్ గేట్ వద్ద మృతదేహాలను కనుగొని వెలికితీశారు. పోలీసులు వాటికి వరంగల్ ఎంజీఎం మార్చురీలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎంజీఎం మార్చురీకి చేరుకున్న వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విద్యార్థుల కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం అందించారు.
బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటా..
ఇటీవల ఎస్సారెస్పీ కెనాల్లో గల్లంతై మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. దేశాయిపేటలోని పాలిటెక్నిక్ విద్యార్థి కొండ తేజయాదవ్ ఇంటికి వెళ్లి మృతుడి తల్లిదండ్రులు కొండ రాజు-సరళను ఎమ్మెల్యే పరామర్శించారు. తేజ ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, తాను స్వయంగా అధికారులతో చర్చించి, పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే, కొత్తవాడకు చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు కావటి కవిత, వస్కుల బాబు ఉన్నారు. అనంతరం ఇటీవల మృతి చెందిన ఉపాధ్యాయుడు వేణుగోపాల్ కుటుంబ సభ్యులను, ప్రమాదంలో గాయపడిన టీఆర్ఎస్ నాయకుడు సంపత్‌ను ఎమ్మెల్యే పరామర్శించారు.