భక్తుల కొంగుబంగారం మల్లన్న స్వామి
13న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభంఐనవోలు, జనవరి 11 : భక్తుల కొంగుబంగారం ఐనవోలు మల్లన్న స్వామి వారి జాతరకు వేళయింది. ఏటా సంక్రాంతి పండుగ వేళ మూడు రోజుల పాటు సాగే ఉత్సవాలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 13న ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ రోజున స్వామి వారికి నూతన వస్ర్తాలంకరణ, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, ధ్వజారోహణం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన నీరాజన మంత్రపుష్పం తీర్థప్రసాదలతో ఉంటాయి. 14న శుక్రవారం భోగి పండుగ, 15న శనివారం మరక సంక్రాంతిన బండ్లు తిరుగుట, 17నా మహాసంప్రోక్షణ, సమారాధన, ఫిబ్రవరి 5న భ్రమరాంబిక అమ్మవారి షష్ట వార్షికోత్సవం, 16న రేణుకాదేవి(ఎల్లమ్మ దేవత) పండుగ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నాయి.
ఆలయం ముస్తాబు
జాతర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పందిళ్లతో పాటు రంగురంగుల తోరణాలతో అలంకరించగా విద్యుద్దీపాలతో ఆలయం మెరిసిపోతోంది. జాతర సమీపించడంతో అప్పుడే భక్తుల రాక మొదలైంది. మంగళవారం బోనాలు, పట్నాలతో ఆలయం వద్ద సందడి కనిపించింది.