రేపు లక్ష్మీనారాయణుడి కల్యాణోత్సవం
ఎడ్లబండ్లపై భారీగా తరలిరానున్న భక్తులు
చిట్యాల, జనవరి 11 : మండలంలోని నైన్పాక గ్రామం నాపాక ఆలయంలో బుధవారం గణపతి, పుణ్యహవచన పూజలు, 13న లక్ష్మినారాయణ కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఏటా ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి రోజున జాతర వైభవంగా నిర్వహిస్తారు. లక్ష్మీనారాయణ కల్యాణం తర్వాత స్థానికులు కోలాటాల ప్రదర్శనలతో ఉత్సవమూర్తుల ఊరేగిస్తారు. నాపాక సర్వతోభద్ర ఆలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు భూపాలపల్లి, మంథని, తాడిచర్ల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ, చిట్యాల మండలాల నుంచి భక్తులు ఎడ్ల బండ్లపై కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లిస్తారు. ఆలయ పరిసరాల్లో వంటలు వండుకుని తిని తిరుగు పయనమవుతారు. ఇక్కడి స్వామి వార్లను పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, ఆగిన పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం.
ఆలయ విశిష్టత.. స్థల పురాణం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి 25 కిలో మీటర్లు, చిట్యాల మండల కేంద్రానికి 12కిలో మీటర్ల దూరంలో నైన్పాక గ్రామంలో నాపాక సర్వతోభద్ర దేవస్థానం (ఆది ఏకశిలా క్షేత్రం) ఉంది. ఇది ద్వాపర యుగాంతం, కలియుగ ప్రారంభంలో మహావిష్ణువు కొలువైన క్షేత్రం. ఇక్కడ నాలుగు వైపుల నాలుగు నామాంకాలపై అమ్మవారు (లక్ష్మీదేవి) కొలువుదీరారు. దక్షిణ అభిముఖాన కళింగమర్దన వేణుగోపాలస్వామి, పశ్చిమాన లక్ష్మీనారాయణస్వామి, ఉత్తరాన సీతా రామ లక్ష్మణులతోపాటు గరుడాళ్వారు, ఆంజనేయస్వామి, తూర్పున లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు ఈ ఏకశిలపై ఉండడం విశేషం. ఏకశిలపై ఈ ఆలయాన్ని నిర్మించినందున ఆది ఏకశిలా క్షేత్రమని, ఆలయాన్ని సర్వతోభద్ర దేవస్థానం అని అంటారు. ఈ ఆలయం ఎక్కడాలేని విధంగా గర్భగుడే ఎత్తున అతిపెద్ద గాలిగోపురంలా ఉంటుంది. ఆలయం పక్కనే స్వామివారి కోనేరు, ఆలయం వెనుక సరస్సు, వరుణదేవుడి పర్వతం, రాజుల కాలంనాటి కచ్చీరు సువిశాలంగా ఉంటుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని నాపాక అని పిలిచేవారని, అందుకే ఈ ఆలయాన్ని నాపాకగుడి అని పేరు వచ్చిందని, నాపాకే క్రమంగా నైన్పాకగా పిలుస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, బ్రహ్మోత్సవాలను భక్తులు విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ బీరవోలు రాంరెడ్డి కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆలయ ప్రధాన అర్చకుడు పెండాల ప్రభాకరాచారి విజ్ఞప్తి చేశారు.