ఆడుకుందామని తీసుకెళ్లి దారుణం
ఆ పై రైలుకింద పడి తానూ ఆత్మహత్య
భార్యాభర్తల మధ్య గొడవలే కారణం
మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండాలో విషాదం
మహబూబాబాద్ రూరల్, జనవరి 11 : పిల్లలకు ఏమాత్రం నలతగా ఉన్నా తల్లిదండ్రుల ప్రాణం విలవిలలాడుతుంది.. వాళ్లు ఏదైనా బాధతో ఏడుస్తుంటే ప్రాణం తల్లడిల్లిపోతుంది. అలాంటిది ఇక్కడో తండ్రి ఆడుకుందామని తీసుకెళ్లి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపాడు. ఆ తర్వాత తానూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణానికి భార్యాభర్తల మధ్య కలహాలే కారణమని తెలుస్తుండగా బావిలో తేలిన చిన్నారుల మృతదేహాలను చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండాలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఉమ్మడి జిల్లాలో విషాదం నింపింది. –
కుటుంబకలహాలతో ఓ కుటుంబం కూలిపోయింది. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఇద్దరు పిల్లలను బావిలో పడేసి చంపిన తండ్రి అటుపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ మండలం రెడ్డిగూడెం తండాలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఉమ్మడి జిల్లాలో విషాదం నింపింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గడ్డిగూడెం పంచాయతీకి చెందిన భూక్యా రామ్‌కుమార్, అదే తండాకు చెందిన శిరీష పదేళ్ల కిత్రం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఏడాదికి రామ్ కుమార్‌కు సీఐఎస్ఎఫ్, ముంబైలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగరీత్యా దంపతులు ముంబైలోనే ఉంటున్నారు. వీరికి కూతురు అమీజాక్సన్ (7), కొడుకు జానీబెస్టో (మున్నా) (4) ఉన్నారు. అమీజాక్సన్ రెండో తరగతి కాగా, జానీబెస్టో ఇంటివద్దే ఉండేవాడు. రెండేళ్ల క్రితం రామ్‌కుమార్ ముంబైలోని ఓ బ్యాంక్‌లో రూ.15లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నాడు.
తన భార్య నగలు కూడా తాకట్టుపెట్టాడు. తన జీతం నుంచి ఇంట్లో రూపాయి కూడా ఇవ్వకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యతో తరచూ గొడవ పడుతూ వేధించేవాడు. బ్యాంకు లోను చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు. నాలుగు రోజుల క్రితం డబ్బుల విషయంలో ముంబైలోనే గొడవై బిడ్డ, కొడుకును తీసుకొని సొంతూరైనా గడ్డిగూడెంతండాకు వచ్చారు. మంగళవారం ఉదయం డబ్బుల విషయంలో మరోసారి గొడవై భార్యను కొట్టాడు. దీంతో శిరీష పిల్లలను తీసుకుని ఎదురుగానే ఉన్న ఆమె తల్లిగారి ఇంటికి వెళ్తున్న క్రమంలో పిల్లలను వెళ్లనీయకుండా అడ్డుపడ్డాడు. తర్వాత వారిని తమ పొలం వద్దకు పోయి ఆడుకుందామని చెప్పి తీసుకెళ్లాడు. వ్యవసాయ బావి వద్ద కొద్ది సేపు ఆడుకుంటున్నట్లు చేసి రామ్‌కుమార్ తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి పారి పోయాడు. కేకలు వినబడడంతో పక్క పొలం వారు వచ్చి చూసే సరికి పిల్లల మృతదేహాలు బావిలో తేలుతూ కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.
రైలు కింద పడి మృతి
బిడ్డలను బావిలోకి తోసి చంపిన నిందితుడు భూక్యా రామ్‌కుమార్ (32) కూడా సాయంత్రం రైలు కింద పడి మృతిచెందాడు. పోలీసులు, జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎస్కే నాగుపాషా తెలిపిన వివరాల ప్రకారం.. రామ్‌కుమార్ తన బిడ్డలను బావిలో వేసి అక్కడి నుంచి పారిపోయాడు. సాయంత్రం అనంతారం ఏరియాలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కృష్ణ ఎక్స్‌ప్రెస్ కింద పడి మృతిచెందాడు. అతడి భార్య శిరీష, అన్న భాస్కర్, రామ్‌కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. తన చిన్నతనంలో కుడికాలు బొటన వేలు గోరుపై డ్రమ్ము పడి చిట్లిపోయి కమిలి ఉండగా దాని ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అన్న భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సహాయక చర్యల్లో మహబూబాబాద్ రూరల్ సీఐ రవి కుమార్, బయ్యారం సీఐ తిరుపతి, ఎస్ఐలు అరుణ్ కుమార్, రమేశ్ బాబు, రాణా ప్రతాప్, రవి, వెంకన్న, ఏఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.