నర్సంపేట, డిసెంబర్ 10: రామప్ప, పాకాల, రంగాయ చెరువు ప్రాజెక్టుల ద్వారా నర్సంపేట నియోజకవర్గ రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పాకాల, రంగాయ చెరువుల ప్రాజెక్టు పనులు, ములుగులో నిర్మాణంలో ఉన్న పైలాన్ పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన అధికారుల సమీక్షలో పెద్ది మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల వల్ల నర్సంపేట, ములుగు నియోజకవర్గాల్లో సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు. గోదావరి జలాలను నర్సంపేట ప్రాంతానికి తరలించేందుకు ఈ రెండు ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్నదని వివరించారు. అక్కడక్కడా మిగిలి ఉన్న చిన్నచిన్న పనులు కూడా పూర్తి కావొచ్చాన్నారు.
సీఎం చేతులమీదుగా ప్రారంభం..
నర్సంపేట నియోజకవర్గంలోని రైతులు పండించే రెండు పంటలకు సాగునీరు పుష్కలంగా అందనుందని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయిందన్నారు. ఈ ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభిస్తారని వెల్లడించారు. త్వరలోనే తమ కల సాకారం కానుందన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
21 వేల కార్డుల పంపిణీ లక్ష్యం
నల్లబెల్లి: నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా 21 వేల కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీయే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులతో నిరుపేద రైతులు ఆర్థిక పురోభివృద్ధి చెందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లబెల్లి ఎంపీడీవో కార్యాలయంలో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్న దుగ్గొండి, నల్లబెల్లి మండలాలకు చెందిన నిరుపేద రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కిసాన్ క్రెడిట్ కార్డులతో పూచీకత్తు లేకుండా రైతులకు రూ. 25 వేల నుంచి రూ. 1.60 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గంలో 21 వేల మంది పాడి, మత్సశాఖ, గొర్రెలకాపరుల సంఘాలు ఉన్నట్లు వివరించారు. వీరందరి జీవితాల్లో వెలుగులు నింపడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
రాజకీయాలకతీతంగా..
లీడ్ బ్యాంక్ ద్వారా రుణం పొందేవారు రాజకీయాలకు తావులేకుండా, ప్రలోబాలకు గురికాకుండా నేరుగా కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకొని బ్యాంకు ద్వారా రుణం పొందొచ్చని పెద్ది సూచించారు. రుణం తీసుకోవాలనుకునే రైతులు విధిగా సంఘానికి సంబంధించిన ఐడీ కార్డు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా దుగ్గొండి మండలానికి చెందిన 4905 మంది పాడి, మత్య్స, గొర్రెలకాపరులను గుర్తించి ఐడీ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంకు జిల్లా అధికారి సత్యజిత్, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ ఊడ్గుల సునీత, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్‌రావు, ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, జేడీ, హైమద్ హుస్సేన్, ఫిషర్స్ అధికారి నరేశ్, మత్య్సశాఖ దుగ్గొండి, నల్లబెల్లి మండలాల అధ్యక్షులు పొన్నం మొగిలి, దామ సాంబయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మండల మాజీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, నాయకులు పాలెపు రాజేశ్వర్‌రావు, కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.