అందరూ భాగస్వాములు కావాలి
ఇకపై షాపుల్లో నిరంతర తనిఖీలు
మేయర్ గుండు సుధారాణి
కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ప్లాస్టిక్ విక్రయదారులతో సమావేశం
వరంగల్, డిసెంబర్ 10: చారిత్రక వరంగల్ నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే మహా కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యాపారులు సంపూర్ణ సహకారం అందించాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో శుక్రవారం ఆమె కమిషనర్ ప్రావీణ్యతో కలిసి నగరంలో ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్-2016 ప్రకారం 75 మైక్రా న్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ను నిషేధించినట్లు తెలిపారు. ప్లాస్టిక్ వ్యాపారులు ప్రభు త్వ నిబంధనలకనుగుణంగా విక్రయాలు చేయాలన్నారు. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యావరణం, పారిశుధ్యం పరోక్షంగా ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయని వివరించారు. పారిశుధ్య కార్యక్రమాల కోసం బల్దియా కోట్ల రూపాయాలు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ వ్యర్థా లు డ్రైనేజీల్లో పేరుకుపోవడం వల్ల మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్న నిషేధిత ప్లాస్టిక్ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.
నిషేధిత ప్లాస్టిక్‌ను విక్రయించొద్దు
ప్లాస్టిక్ హోల్‌సెల్ వ్యాపారులు నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను విక్రయించకుండా కార్పొరేషన్‌కు సహకరించాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. నగరంలో నిషేధిత ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేసి, నిరంతర తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రాస్టిక్కు ప్రత్యామ్నాయంగా మెప్మా ఆధ్వర్యంలో తయారు చేస్తున్న జూట్ బ్యాగులు, పేపర్ సంచులను వినియోగించేలా ప్రోత్సహించాలని అన్నారు. నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు నిలిపివేస్తే కార్పొరేషన్ పక్షాన వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ నిషేధిత ప్లాస్టిక్ నిర్మూలన కోసం పోలీస్, బల్దియా సిబ్బందితో కలిసి సంయుక్తంగా ఎన్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. వీధి వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లకు బదులు మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలు తయారు చేస్తున్న జ్యూట్, పేపర్ బ్యాగులను వినియోగించాలన్నారు. చిరువ్యాపారులకు అవగాహన కల్పించి, ఆ దిశలో ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కమిషనర్ విజయలక్ష్మి, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు మాదాసి సాంబయ్య, నరేందర్, భాస్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు కుమారస్వామి, ఎల్లస్వామి, ఐటీసీ, వావ్ ప్రోగాం కో ఆర్టినేటర్లు కిరణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.