నయీంనగర్/సుబేదారి డిసెంబర్ 10 : భూతగాదా కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేయడానికి భూచట్టాలపై ప్రతి పోలీసు అధికారి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి అన్నారు. భూతగాదాల కేసుల విషయంలో సమగ్ర దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేసేందుకు నిట్‌లో ఏసీపీలు, సీఐలు, ఎస్సైలతో భూతగాదాల దర్యాప్తులు-చట్టాలపై శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. అంతకుముందు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన బిపిన్‌రావత్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో భూమి విలువలు రెట్టింపు కావడంతో భూతగాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. దీంతో భూ తగాదాలకు సంబంధించి పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య పెరిగిందని అన్నారు. ఈ కేసుల పరిష్కారం కోసం పోలీసు అధికారులు నిర్వహించాల్సిన దర్యాప్తు తీరు తెన్నులు, వచ్చిన భూ తగాదాల్లో సివిల్ తగాదాలుగా పరిగణించాలా లేదా క్రిమినల్ కేసులుగా పరిగణించాలనే పోలీసు అధికారులు సంసిద్ధతలో ఉంటారని చెప్పారు. ఇలాంటి సమయంలో భూ చట్టాలపై అధికారులకు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాధితులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రముఖ న్యాయవాది సునీల్‌కుమార్ మాట్లాడుతూ వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధి పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న భూతగాదా కేసులను పరిష్కరించడంలో పోలీసు అధికారులు భూ చట్టాలపై మరింత అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రాష్ట్రంలోని భూ చట్టాలు, భూతగాదాలను పరిష్కరించేందుకు పరిశీలించాల్సిన పత్రాలు, భూమి హక్కుదారులను గుర్తించాల్సిన తీరు, బాధితులకు న్యాయం చేయడం కోసం అధికారులు పరిగణనలోనికి తీసుకోవాల్సిన పత్రాలు, అనుసరించాల్సిన చట్టాలు, భూతగాదాలకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి వెలువడిన తీర్పులపై అధికారులకు అవగాహన కల్పించారు. సమావేశంలో డీసీపీలు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటలక్ష్మి, పుష్పారెడ్డి, అదనపు డీసీపీలు వైభవ్ గైక్వాడ్, సాయి చైతన్య, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.