కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా కార్మికుల కదం
రెండో రోజూ సమ్మె విజయవంతం
జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా
బోసిపోయిన గనులు
ఎక్కడివక్కడే నిలిచి పోయిన లారీలు, టిప్పర్లు
31,630 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
భూపాలపల్లి, డిసెంబర్ 10: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కార్మికులు శుక్రవారం రెండో రోజు సమ్మె కొనసాగించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్), ఐదు జాతీయ కార్మిక సంఘాలైన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ నేతలు, కార్మికులు స్వచ్ఛందంగా విధులకు గైర్హాజరయ్యారు. దీంతో భూపాలపల్లి ఏరియా బొగ్గు గనులన్నీ నిర్మానుష్యంగా మారాయి. సమ్మె కారణంగా రెండు రోజులుగా 31,360 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సంస్థకు రూ. 9.59 కోట్ల నష్టంవాటిల్లినట్లు సింగరేణి అధికార వర్గాలు వెల్లడించాయి. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో కేటీకే 1, 5, 6, 8 భూగర్భ గనులు, కేటీకే ఓసీపీ-2, కేటీకే ఓసీపీ -3 గనులు ఉన్నాయి. డిసెంబర్లో రోజుకు 15,815 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ నిర్దేశిత లక్ష్యంగా ఉంది .
నిలిచిన బొగ్గు రవాణా
భూపాలపల్లి ఏరియాలో సమ్మెతో శుక్రవారం బొగ్గు రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. సమ్మె మొదటి రోజైన గురువారం సింగరేణి అధికారులు బొగ్గు ఆధారిత పరిశ్రమలకు కొంత మేర బొగ్గును రవాణా చేసినట్లు తెలుసుకున్న జేఏసీ నాయకులు, ఏరియాలోని అన్ని గనులపై ప్ర త్యేక నిఘా పెట్టడంతో రెండో రోజు శుక్రవారం బొగ్గు రవాణాకు అధికారులు సాహసించలేదు. తద్వారా లారీలు టిప్పర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గనుల బంకర్లు, వేబ్రిడ్జిలు బోసిపోయి కనిపించాయి.
జేఏసీ నాయకుల ఆందోళన
భూపాలపల్లి ఏరియా కేటీకే ఓసీపీ-2 గని వద్ద జేఏసీ నాయకులు నిరసన , ఆందోళన చేపట్టారు. వీరికి భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, టీఆర్ఎస్ భూపాలపల్లి అర్బన్ కమిటీ అధ్యక్షుడు కటకం జనార్దన్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు స్వచ్ఛందంగా విధులకు గైర్హాజరై మెరుపు సమ్మె చేయడం అభినందనీయమన్నారు. సమ్మెను చూసైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కళ్లు తెరిచి, బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, వాటిని సింగరేణి సంస్థకే కేటాయించాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకుడు కొక్కుల తిరుపతి మాట్లాడుతూ సమ్మెను కొనసాగిస్తున్న సింగరేణి కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. సమ్మె సెగ కేంద్రానికి తాకిందన్నారు. వేలం వేయాలని నిర్ణయించిన నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు చెప్పారు. సంప్రదింపులు మొదలయ్యాయని తిరుపతి అన్నారు. జేఏసీ నాయకులు మోటపల్కుల రమేశ్, పసూనూటి రాజేందర్, బుచ్చయ్య అప్పాని శ్రీనివాస్, కంపేటి రాజయ్య సమ్మె చేస్తున్న సింగరేణి కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. సమ్మెకాలంలో జీఎం కార్యాలయంలో విధులు నిర్వర్తించడం సరైంది కాదని జేఏసీ నేతలు సూచించడంతో వారు ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు రత్నం సమ్మిరెడ్డి బడితల సమ్మయ్య, రాజిరెడ్డి, రఘోత్తంరెడ్డి, నల్లబెల్లి సదానందం, జగత్రావు కొచ్చర్ల రవికుమార్ బాషనపల్లి కుమారస్వామి, గాజె సాంబయ్య దేవరకొండ మధు టీఆర్ఎస్ నేత సెగ్గం సిద్ధు తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ యూనియన్ నుంచి ఫిట్ కమిటీ స్థాయి నాయకుడి బహిష్కరణ
యూనియన్ నియమాలను ఉల్లంఘించి విధులకు హాజరైన ఏరియాలోని కేటీకే ఓసీపీ-2 గని ఏఐటీయూసీ ఫిట్ కమిటీ నేత కొత్తూరి రాజేందర్‌ను యూనియన్ నుంచి బహిష్కరించినట్లు ఆ యూనియన్ భూపాలపల్లి బ్రాంచి కమిటీ కార్యదర్శి మోటపల్కుల రమేశ్ తెలిపారు.
విధుల్లో అత్యవసర సిబ్బంది..
భూపాలపల్లి ఏరియాలో డిపార్ట్మెంట్లు, గనుల్లో మొదటి షిఫ్టులో మొత్తం 3,417 మంది ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సి ఉండగా, గనులు, డిపార్ట్మెంట్లు, ఏరియా దవాఖానలో పనిచేసే అత్యవసర సిబ్బంది 530 మంది విధులకు హాజరయ్యారు. రెండో షిఫ్టులో 1,110 మంది ఉద్యోగులు హాజరు కావాల్సి ఉండగా, 164 మంది విధులకు హాజరయ్యారయ్యారు.