బోయినపల్లి మార్కెట్‌కు పచ్చిమిర్చి తరలింపు
నిత్యం 60 నుంచి 100 క్వింటాళ్లు రవాణా
కమీషన్ పద్ధతిలో వ్యాపారులకు అమ్ముతున్న రైతులు
ఏటూరునాగారం, డిసెంబర్ 10 :ఏటూరునాగారంలోని జాతీయ రహదారి వెంట వందలాది మంది రైతులు వేలాది ఎకరాల్లో మిర్చి పంట సాగుచేస్తున్నారు. అయితే, మిర్చి పంటకు తెగుళ్ల భయంతో కొందరు, పంటచేతికొచ్చాక గిట్టుబాటు ధర వస్తుందో రాదోనని మరికొందరు పచ్చిమిర్చినే అమ్ముకుంటున్నారు. వీరు ఏకంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని బోయినపల్లి మార్కెట్‌కు పచ్చిమిర్చిని రవాణా చేస్తున్నారు. కమీషన్ పద్ధతిలో వ్యాపారులు రైతుల తోటల వద్దకే వచ్చి కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
ఏటూరునాగారం టు హైదరాబాద్
ఏటూరునాగారంలో సాగు చేస్తున్న పచ్చిమిర్చి ఏకంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర రాజధానికి రవాణా అవుతున్నది. ఏటూరునాగారంలోని జాతీయ రహదారి వెంట చాలామంది రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. అయితే, మిర్చిసాగు ఎక్కువగా ఉండడంతో లోకల్‌గా పచ్చిమిర్చికి పెద్దగా డిమాండ్ ఉండకపోవడం.., మిర్చితోటలకు తెగుళ్లు సోకి దెబ్బతినడం, పంట చేతికొచ్చిన తర్వాత మార్కెట్లో గిట్టుబాటు ధర ఉండకపోవడం వంటి భయాలతో కొందరు, పంట చేతికొచ్చేదాక ఎదురు చూడలేక మరికొందరు రైతులు పచ్చిమిర్చినే అమ్ముకుంటున్నారు. హైదరాబాద్‌లోని బోయినపల్లి మార్కెట్‌కు ఇక్కడ నుంచి ప్రతి నిత్యం 60 నుంచి 100 క్వింటాళ్ల పచ్చిమిర్చి రవాణా చేస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం ఐదు, ఆరు గంటల ప్రాంతంలో పచ్చిమిర్చి వాహనాల్లో లోడ్ చేసి హైదరాబాద్‌లోని బోయినపల్లి మార్కెట్‌కు తరలిస్తున్నారు. పచ్చిమిర్చిని అమ్ముకోడం వల్ల పెట్టుబడికి డబ్బుల ఉపయోగపడుతున్నాయని పలువురు రైతులు తెలిపారు. ఎకరం మిర్చి సాగు చేయడానికి సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతున్నది. రెండు, మూడు ఎకరాల్లో మిర్చిసాగు చేసే సన్నకారు రైతులు పెట్టుబడి భారమై ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో పచ్చిమిర్చినే తెంపి, అమ్ముకుని పెట్టుబడికి డబ్బులు సమకూర్చుకుంటున్నారు. దీంతోపాటు భూసారాన్ని బట్టి మిర్చితోట ఎదుగుదల ఉంటుందని కొందరు రైతులు తెలిపారు. మొక్క చిన్నగా ఉన్నప్పుడే కాయలు కాయడం వల్ల మొక్కలో ఎదుగుదల ఉండదని, తద్వారా నష్టం వస్తుందని అంటున్నారు. పచ్చిమిర్చిని తెంపడం వల్ల చెట్టుకు బరువు తగ్గి మొక్క ఏపుగా పెరుగుతుందని, దీంతో కాత పెరిగి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.
హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.20 వరకు ..
హైదరాబాద్‌లోని బోయినపల్లి మార్కెట్ కిలో పచ్చిమిర్చి ధర ప్రస్తుతం రూ. 20 వరకు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక్కడ ఉన్న రైతులంతా కమిషన్ పద్ధతిలో ఓ వ్యాపారికి పచ్చిమిర్చిని విక్రయిస్తున్నారు. సదరు వ్యాపారి రైతులకు అవసరమైన ఖాళీ బస్తాలను సమకూర్చడం, ట్రాన్స్పోర్ట్ చార్జీలను భరించి పచ్చిమిర్చిని మార్కెట్‌కు తరలిస్తున్నాడు.
మొక్కల ఎదుగుదల కోసం
మిర్చితోటలో మొక్కలు ఎదగడం లేదు. చిన్నగా ఉన్నప్పుడే కాయలు కాస్తున్నాయి. ఇండికా విత్తనం సాగు చేశా. కాయలు కోస్తే మొక్కలు ఎదిగి పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని పచ్చిమిర్చి అమ్ముతున్నాం. హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధర ఆధారంగా కిలోకు రూ.2 కమీషన్‌పై వ్యాపారులకు విక్రయిస్తున్నాం. బస్తాలు, ట్రాన్స్పోర్ట్ చార్జీలు వ్యాపారి భరిస్తున్నాడు. ప్రస్తుతం పంటకు తామర పురుగు సోకుతున్నది. రెండు ఎకరాల్లో మిర్చి పంట వేశాను. వచ్చే డబ్బులు పెట్టుబడికి ఉపయోపడుతాయి.
-పాగిడి లక్ష్మయ్య, మిర్చి రైతు